
ముంబై: వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) అరంగేట్ర సీజన్‌కు సంబంధించిన వేలాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆక్షనీర్ మల్లికా సాగర్‌పై టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ప్రశంసల జల్లు కురిపించాడు. శభాష్ మల్లికా అంటూ ట్వీట్ చేశాడు. 'మల్లికా సాగర్ అద్భుతమైన ఆక్షనీర్. చాలా స్పష్టంగా, ఎంతో ఆత్మవిశ్వాసంతో.. ధైర్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. డబ్ల్యూపీఎల్ వేలంలో ఆమెను ఆక్షనీర్‌గా ఎంపిక చేసిన బీసీసీఐని అభినందించాలి.' అని కార్తీక్ ప్రశంసల జల్లు కురిపించాడు.
ముంబైకి చెందిన మల్లికా సాగర్.. పురాతన పెయింటింగ్స్ (ఆర్ట్)ను సేకరించే వృత్తిలో ఉన్నారు. ఆమె మోడ్రన్ అండ్ కాన్‌టెంపరరీ అనే ఆర్ట్ ఇండియా కన్సల్టెంట్ సంస్థలో విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే ఆమె ఆర్ట్ ఇండియా కన్సల్టెంట్స్ ఫర్మ్‌లో పార్ట్‌నర్‌గా కూడా ఉన్నారు. ఆక్షన్‌లు నిర్వహించడంలోనూ మల్లికకు పూర్వ అనుభవం ఉంది. పుండోల్స్ అనే ముంబై బేస్డ్ సంస్థ తరఫున వైవిధ్యభరితంగా వేలం నిర్వహించి గతంలో ఆమె వార్తల్లోకెక్కారు. క్రీడలకు సంబంధించిన వేలం నిర్వహణలోనూ మల్లికకు ప్రవేశం ఉంది. 2021 ప్రో కబడ్డీ లీగ్ వేలాన్ని ఆమె సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించారు.
ముంబై వేదికగా బుధవారం జరిగిన మహిళళా క్రికెటర్ల వేలంలోనూ మల్లికా సాగర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన వాక్చాతుర్యం, అందంతో అందరిని ఆకట్టుకున్నారు. ఈ వేలం భారత క్రికెటర్ల పంట పండింది. అంచనాలకు మించి సాగిన ఈ వేలంలో కాసుల వర్షం కురిసింది. టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన అంచనాలకు మించి అత్యధిక ధర పలికిన క్రికెటర్‌గా నిలిచింది. ఆమె కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏకంగా రూ.3.4 కోట్లు వెచ్చించింది. ప్రతి జట్టు రూ.12 కోట్లతో వేలంలో అడుగుపెట్టాయి. మొత్తం 409 మంది వేలం బరిలో దిగగా... 87 మందిని ఫ్రాంఛైజీలు కొనుగోలు చేశాయి.
అందులో 30 మంది విదేశీ క్రికెటర్లు. ఒక్కో జట్టు 6 మంది విదేశీ క్రికెటర్ల చొప్పున తీసుకుంది. మొత్తం రూ.59.5 కోట్లను ఫ్రాంఛైజీలు ఖర్చు పెట్టాయి. ఆర్సీబీ, దిల్లీ, గుజరాత్ 18 మంది క్రికెటర్ల చొప్పున కొనుగోలు చేయగా.. ముంబయి 17 మందిని, యూపీ వారియర్స్ 16 మందిని సొంతం చేసుకున్నాయి.