
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) అరంగేట్ర సీజన్‌ను మార్చి 4 నుంచి 26 వరకు నిర్వహిస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. ఐదు జట్ల మధ్య మొత్తం 22 మ్యాచ్‌లు ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం, బ్రాబౌర్న్ స్టేడియం వేదికలుగా జరుగుతాయని పేర్కొంది. ఈ మేరకు బీసీసీఐ మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఫిబ్రవరి 13న ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్ వేదికగా ప్లేయర్స్ ఆక్షన్ నిర్వహిస్తామన్న పేర్కొన్న బీసీసీఐ.. 1525 రిజిస్ట్రేషన్స్ నుంచి ఐదు ఫ్రాంచైజీలు 409 మంది ప్లేయర్లను షార్ట్ లిస్ట్ చేశాయని పేర్కొంది.
ఈ షార్ట్ లిస్ట్ జాబితాలో 249 మంది భారత ప్లేయర్లు ఉండగా.. 163 మంది ఓవర్‌సీస్ ప్లేయర్లున్నారు. అసోసియేట్ నేషన్స్ నుంచి 8 మంది పాల్గొననున్నారు. క్యాప్‌డ్ ప్లేయర్లు 202 మంది కాగా.. అనామక ప్లేయర్లు 199 మంది ఉన్నారు. మొత్తం ఐదు ఫ్రాంచైజీల నుంచి 90 మంది ఆటగాళ్లు వేలంలో అమ్ముడు పోనుండగా.. ఇందులో 30 ఓవర్ సీస్ స్లాట్స్ ఉన్నాయి.
అత్యధిక కనీస ధర 50 లక్షలు కాగా.. ఇందులో 24 మంది ప్లేయర్లు రిజిస్టర్ చేసుకున్నారు. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు స్మృతి మంధాన, దీప్తి శర్మ, అండర్ 19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ షెఫాలీ వర్మలతో పాటు తదితరులు ఈ జాబితాలోనే ఉన్నారు. 13 మంది ఓవర్‌సీస్ ఆటగాళ్లు.. 50 లక్షల జాబితాలో నమోదు చేసుకున్నారు. ఎల్లీస్ పెర్రీ, సోఫీ ఎక్లేస్టోన్, సోఫీ డివైన్ తదితరులున్నారు. 40 లక్షల కనీస ధరతో 30 మంది ప్లేయర్లు పోటీపడుతున్నారు. ప్లేయర్ల వేలం మధ్యాహ్నం 2.30కు ప్రారంభం కానుంది.
ఐదు జట్ల విక్రయాల ద్వారా బీసీసీఐకి రూ.4,669.99 కోట్లు రాగా.. వచ్చే ఐదేళ్ల మీడియా రైట్స్‌ను రిలయన్స్‌కు చెందిన వయాకామ్ సంస్థ రూ.951 కోట్లకు కొనుగోలు చేసింది. అహ్మదాబాద్, మంబై, బెంగళూరు, ఢిల్లీ, లక్నో బేస్ ఫ్రాంచైజీల కోసం మొత్తం 30 కంపెనీలు పోటీపడగా.. అత్యధిక ధరను బిడ్ వేసిన ఆదాని గ్రూప్, ముంబై ఇండియన్స్, ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, కాప్రి గ్లోబల్ సంస్థలు మహిళా ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీలను దక్కించుకున్నాయి.