
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) అరంగేట్ర సీజన్ టైటిల్‌ను ముంబై ఇండియన్స్ గెలుచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో గెలిచి తొలి టైటిల్‌ను ముద్దాడింది. ఫైనల్లో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ హేలీ మాథ్యూస్(3/5) అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ టోర్నీలో 16 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ అందుకున్న హేలీ.. బ్యాటింగ్‌లో 271 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచింది. మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్‌గా అవార్డు దక్కించుకుంది.
హేలీ ఆల్‌రౌండ్ సామర్థ్యం ముంబై జట్టుకు చాలా బలంగా మారింది. టీమ్ కాంబినేషన్‌తో పాటు సరైన ఓపెనర్‌గా.. స్పిన్నర్‌గా జట్టుకు అన్ని విధాల ఉపయోగపడింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. డబ్ల్యూపీఎల్ వేలంలో హేలీ మాథ్యూస్‌ను ఫ్రాంచైజీలన్నీ ఛీకొట్టాయి. తొలి రౌండ్ వేలంలో ఒక్క ఫ్రాంచైజీ కూడా హేలీని తీసుకోవడానికి ముందుకు రాలేదు. సెకండ్ రౌండ్‌లో ముంబై ఇండియన్స్ దయ తలిచి ఆమె కనీస ధర రూ.40 లక్షలకు కొనుగోలు చేసింది. అదృష్టవశాత్తు అత్యంత తక్కువ ధరకే ఎంతో విలువైన ప్లేయర్‌ను జట్టులోకి తీసుకుంది.
ముంబై ప్రాక్టీస్ క్యాంప్‌ల్లోనే ఆమె సత్తాను గుర్తించిన ఫ్రాంచైజీ.. ఓపెనర్‌గా అవకాశం ఇవ్వడంతో పాటు బౌలింగ్‌లోనూ నమ్మకం ఉంచింది. ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న హేలీ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ముంబై ఇండియన్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించింది. హేలీ ముందు కోట్లు కొల్లగొట్టిన ప్లేయర్లు కూడా తేలిపోయారు. డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికి స్మృతి మంధానా.. హీలీ ప్రదర్శనలో సగం కూడా రాణించలేకపోయింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. మెగ్ లానింగ్(29 బంతుల్లో 5 ఫోర్లతో 35), శిఖా పాండే (17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 27 నాటౌట్), రాధా యాదవ్ ( 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27 నాటౌట్) ఆదుకున్నారు. ముంబై బౌలర్లలో ఇసీ వాంగ్ (3/42), హేలీ మాథ్యూస్ (3/5), అమేలియా కెర్ (2/18) చెలరేగారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై 19.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 134 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. నాట్ సీవర్‌తో పాటు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (39 బంతుల్లో 5 ఫోర్లతో 37), అమేలియా కేర్ (8 బంతుల్లో 2 ఫోర్లతో 14 నాటౌట్) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో రాధా యాదవ్, జోనాసెన్ చెరొక వికెట్ పడగొట్టారు.