WTC Final 2021: న్యూజిలాండ్‌తో తలపడే భారత తుది జట్టు ఇదే.. ఆ ఇద్దరికి నో చాన్స్!

హైదరాబాద్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు మరో నాలుగు రోజుల్లో తెరలేవనుంది. జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా జరగనున్న ఈ మెగా ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఫస్ట్ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ కావడం, రెండు బలమైన జట్లు టైటిల్ పోరులో తలపడుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఓవైపు మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా ఈ టైటిల్ పోరుకు టీమిండియా సిద్దమవుతుంటే.. మరోవైపు ఇంగ్లండ్‌పై సాధించిన రెండు టెస్ట్‌ల సిరీస్ విజయానందంలో న్యూజిలాండ్ బరిలోకి దిగుతుంది. అయితే ప్రాక్టీస్ లేకుండా బరిలోకి దిగుతున్న టీమిండియాకు గట్టి సవాళ్లు ఎదురవుతాయని మాజీ క్రికెటర్ల అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా తుది జట్టు ఎంపిక చేసుకోవడం కూడా కష్టమవుతుందంటున్నారు. ఇక ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌తో తుది జట్టును ఎంపిక చేయాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది. న్యూజిలాండ్‌తో బరిలోకి దిగే భారత తుది జట్టును పరిశీలిద్దాం.

ఓపెనర్లుగా ఆ ఇద్దరూ..
టీమిండియా ప్రధాన ఓపెనర్‌గా రోహిత్ శర్మ బరిలోకి దిగడంలో ఎలాంటి సందేహం లేదు. మ్యాచ్ సమయానికి అతనికేమైనా ఫిట్‌నెస్ సమస్యలు వస్తే తప్పా అతను ఆడటం దాదాపు ఖాయమైపోయింది. హిట్‌మ్యాన్‌కు తోడుగా శుభ్‌మన్‌గిల్‌కు అవకాశం దక్కవచ్చు. ఎందుకంటే ఈ యువ ఓపెనర్ ఆస్ట్రేలియా గడ్డపై దుమ్మరేపాడు. అద్భుతంగా ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో, ఐపీఎల్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలో మెగా మ్యాచ్‌కు ముందు జరిగే ప్రాక్టీస్ సెషన్స్‌లో శుభ్‌మన్ విఫలమైతే మాత్రం మయాంక్ అగర్వాల్ లేదా కేఎల్ రాహుల్‌లో ఒకరికి అవకాశం రావచ్చు. పైగా ఈ ఇద్దరూ ఐపీఎల్‌లో దుమ్మురేపారు. అయితే టీమ్‌మేనేజ్‌మెంట్ తొలి ప్రాధాన్యత మాత్రం శుభ్‌మన్ గిల్ అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.

మిడిలార్డ్‌లో విరాట్, పుజారా, రహానే..
ఇక ఫస్ట్ డౌన్‌లో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా రానుండగా.. నాలుగులో కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఐదులో వైస్‌కెప్టెన్ అజింక్యా రహానే ఆడటం ఖాయం. మ్యాచ్‌కు ముందు ఏమైనా గాయాలు అయితే తప్పా ఈ త్రయానికి జట్టులో చోటుకు డోకా లేదు. ఆసీస్ పర్యటనలో పుజారా, రహానే రాణించారు. కోహ్లీ ఆడిన ఏకైక మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించాడు. ఇక ఆరో స్థానంలో హిట్టర్, వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ ఆడటం కూడా ఖాయమే. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాపై అతను దుమ్మురేపాడు. ఒంటి చేత్తో విజయాలందించాడు. ఐపీఎల్‌లోనూ కెప్టెన్‌గా సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో కూడా అంచనాలను అందుకుంటే భారత్‌కు తిరుగుండదు.

బౌలర్లా? బ్యాట్స్‌మన్?
ఇక ఆల్‌రౌండర్లుగా, స్పిన్నర్లుగా సీనియర్ ప్లేయర్స్ రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఆడటం ఖాయం. వీరిని జట్టులోకి తీసుకోవడం వల్ల బ్యాటింగ్ డెప్త్ కూడా పెరుగుతుంది. అయితే టెస్ట్ స్పెషలిస్ట్ అయిన హనుమ విహారిని విస్మరించలేం. మ్యాచ్ సమయానికి పిచ్ పరిస్థితుల దృష్ట్యా టీమ్‌మేనేజ్‌మెంట్ మరో అదనపు బ్యాట్స్‌మెన్ కావాలనుకుంటే విహారిని తీసుకోవచ్చు. అప్పుడు ఇద్దరు ఆల్‌రౌండర్లలో ఒకరు మాత్రమే ఆడాలి లేదా ఒక పేసర్‌ను తగ్గించుకోవాలి. అదే జరిగితే జడేజా, ఇషాంత్‌లో ఒకరు బెంచ్‌కు పరిమితం కావచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లోనైతే హనుమ విహారికి చోటు దక్కడం కష్టమే.

సీనియర్లకే చాన్స్..
పేసర్ల కోటాలో సీనియర్లకే టీమ్‌మేనేజ్‌మెంట్ అవకాశం కల్పించవచ్చు. ఈ లెక్కన మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా ఆడటం ఖాయం. కానీ మహ్మద్ సిరాజ్‌ను విస్మరించలేం. పేస్‌తో పాటు స్వింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై టీమ్‌మేనేజ్‌మెంట్ సిరాజ్‌కు అవకాశం కల్పించాలనుకుంటే ఇషాంత్, షమీల్లో ఒకరికి చోటు దక్కకపోచ్చు. మీడియా సమావేశానికి ముందు విరాట్, శాస్త్రి.. సిరాజ్ గురించి చర్చించిన నేపథ్యంలో అతనికి అవకాశం దక్కవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా ఆస్ట్రేలియా పర్యటన అనంతరం సిరాజ్ దుమ్మురేపుతున్నాడు. మరో బౌలర్ కమ్ బ్యాట్స్‌మన్ అయిన శార్దూల్ ఠాకూర్‌కు కూడా బెంచ్‌కే పరిమితం కానున్నాడు.

ప్రాక్టీస్ మ్యాచ్‌తో హెడెక్..
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు సన్నాహకంగా టీమిండియా ఆడుతున్న ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌తో టీమ్‌మేనేజ్‌మెంట్‌కు కొత్త చిక్కువచ్చి పడింది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్ సెంచరీతో మెరిశాడు. రోహిత్ శర్మ సైతం హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అటు ఇషాంత్ శర్మ మూడు వికెట్లతో మెరవగా.. సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. దాంతో తుది జట్టులో ఓపెనర్లుగా ఎవరిని ఆడించాలి? పేస్ విభాగాన్ని ఎవరితో భర్తీ చేయాలి అనేదాని టీమ్‌మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది. మరోవైపు మయాంక్‌ను కూడా పరిశీలించాలని, ఇషాంత్ ప్లేస్‌లో సిరాజ్‌ను ఆడించాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. అయితే మ్యాచ్ నాటి పరిస్థితులు, న్యూజిలాండ్ బలహీనతలను దెబ్బకొట్టే వ్యూహాలకు పనికొచ్చే ఆటగాళ్లకే అవకాశం దక్కనుంది.

భారత్ తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications