
న్యూఢిల్లీ: వరల్డ్ క్రికెట్ పెద్దన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఖజానా అంతకంతకూ పెరుగుతూనే ఉంది. 2018-19 ఆర్థిక సంవత్సరం బోర్డు ఆదాయాన్ని రూ. 14,489.80 కోట్లుగా ప్రకటించింది. లేటెస్ట్ బ్యాలెన్స్ షీట్ ప్రకారం ఆ ఏడాది బీసీసీఐ మొత్తంగా రూ. 4,017 కోట్లు సంపాదించగా.. అందులో సగం కంటే ఎక్కువ (రూ. 2407 కోట్లు) కేవలం 2018 ఐపీఎల్ నుంచే రావడం విశేషం. అలాగే, ఇండియా టీమ్ మీడియా రైట్స్ అమ్మకం ద్వారా రూ. 825 కోట్లు సమకూరాయి. ఆ ఏడాది బోర్డు రూ. 1592 కోట్లు ఖర్చు చేసింది.
అయితే, ఈ బ్యాలెన్స్ షీట్‌ను బోర్డు ఇంకా పబ్లిక్ డొమైన్‌లో పెట్టలేదు. అలాగే, 2019-20కి సంబంధించిన అకౌంట్స్ ఇంకా రెడీ కాలేదని తెలుస్తోంది. కానీ, ఈ నాలుగైదేళ్లలో బోర్డు ఆదాయం భారీగా పెరగడం విశేషం. 2014-15 ఫైనాన్షియల్ ఇయర్‌లో బోర్డు నెట్ వర్త్ రూ. 5,438 కోట్లు కాగా.. తర్వాతి ఏడాది ఏకంగా 2408 కోట్లు ఆర్జించడంతో 2015-16లో ఆదాయం రూ.7847 కోట్లకు చేరింది. ఇక, 2016-17లో 8 వేల కోట్లు దాటింది.
ఇంకో ఏడాదిలో ఏకంగా రూ. 3,460 కోట్లు అర్జించిన బోర్డు ఖజానా 2017-18 సీజన్‌లో రూ. 11,892 కోట్లకు పెరిగింది. తాజా బ్యాలెన్స్ షీట్ ప్రకారం 2019 మార్చి 31 నాటికి బోర్డు నెట్ వర్త్ రూ. 14,489 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు ఏడాదితో పోల్చుకుంటే 2597.19 కోట్లు ఎక్కువ ఆదాయం సంపాదించింది.