న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాప్ స్కోరర్‌గా నిలుస్తాడని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం చెప్పాడు. మెగా టోర్నీలంటే రోహిత్ శర్మ ఉత్సాహం పుట్టుకొస్తుందని, అసాధారణమైన బ్యాటింగ్‌తో చెలరేగుతాడని పేర్కొన్నాడు. ఈసారి ఆటగాడిగా కాకుండా కెప్టెన్‌గా బరిలోకి దిగుతున్నాడని, ప్రత్యర్థులకు చుక్కలేనని హెచ్చరించాడు.
అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనున్న విషయం తెలిసిందే. మెగా టోర్నీ కోసం ప్రధాన జట్లన్నీ సిద్దమవుతున్నాయి. ఇప్పటికే టాప్-4లో నిలిచే జట్లు, విజేతల గురించి పలువురు మాజీ క్రికెటర్లు తమ అంచనాలను వెల్లడించారు. తాజాగా ఐసీసీతో మాట్లాడిన సెహ్వాగ్.. టాప్ స్కోరర్‌గా రోహిత్ శర్మ నిలుస్తాడని చెప్పాడు.

'ప్రపంచకప్ అంటే రోహిత్ శర్మలో ఎక్కడ లేని ఉత్సాహం పుట్టుకొస్తోంది. అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగుతాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో దుమ్మురేపిన రోహిత్.. ఈ సారి కూడా అదే జోరు కొనసాగిస్తాడు. పైగా ఈ సారి కెప్టెన్‌గా బరిలోకి దిగుతున్నాడు. కాబట్టి మరింత జాగ్రత్తగా ఆడుతాడు. కచ్చితంగా తనదైన బ్యాటింగ్‌తో ఈ మెగాటోర్నీలో భారత్ చిరస్మరణీయ విజయాలు అందిస్తాడు. టున్నుల కొద్దీ పరుగులు చేస్తాడు.
భారత పిచ్‌లపై ఓపెనర్లు మంచి స్కోర్లు చేస్తారు. ఎవరు బాగా ఆడుతారని అడిగితే రోహిత్ శర్మ పేరే చెబుతా. మరో ఇద్దరు ముగ్గురు పేర్లున్నా.. భారత ఆటగాడిగా రోహిత్ శర్మపేరే సూచిస్తాను.'అని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
సెహ్వాగ్ వ్యాఖ్యలపై విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు. కోహ్లీ పేరు చెప్పకుండా రోహిత్ శర్మ హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వన్డే ప్రపంచకప్‌లో చెలరేగేది కోహ్లీనేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 14న దాయాదీ పాకిస్థాన్‌తో తలపడనుంది.