హైదరాబాద్: వన్డే ప్రపంచకప్ 2023 నేపథ్యంలో టీమిండియాలో కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ప్రతీ మ్యాచ్ తర్వాత మైదానంలో అత్యుత్తమ ఫీల్డింగ్ ప్రదర్శన కనబర్చిన ఆటగాడికి బంగారు పతకం అందజేస్తున్నారు. బెస్ట్ ఫీల్డర్‌ను ఒకటి రెండు క్యాచ్‌లు పట్టినందుకు కాకుండా.. మ్యాచ్ ఆసాంతం చేసిన ఫీల్డింగ్‌ను పరిగణలోకి తీసుకుంటున్నారు.
టీమిండియా ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ ఆటగాళ్ల ఫీల్డింగ్‌ను లెక్కిస్తూ ఈ అవార్డుకు ఎంపిక చేస్తున్నారు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో అత్యుత్తమ ఫీల్డర్‌గా విరాట్ కోహ్లీని ఎంపిక చేశారు. ఓ బెస్ట్ క్యాచ్‌తో పాటు మ్యాచ్ ఆసాంతం ఫీల్డింగ్‌లో నిలకడ చూపించాడని, తన ఫీల్డింగ్‌తో సహచర ఆటగాళ్లను ఎంకరేజ్ చేశాడని ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ చెప్పాడు.

ఈ అవార్డు గురించి ముందుగా టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడాడు. 'వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో కొత్త సంప్రదాయానికి తెరలేపాం. ప్రతీ మ్యాచ్‌లో అత్యుత్తమ ఫీల్డింగ్ కనబర్చిన ఆటగాడికి గోల్డ్ మెడల్ అందిస్తాం. దీని గురించి ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ వివరిస్తాడు.'అని తెలిపాడు.
అనంతరం టీ దిలీప్ మాట్లాడుతూ.. బెస్ట్ ఫీల్డింగ్ చేసిన ఆటగాడిగా ఈ అవార్డు దక్కుతుందని, బెస్ట్ క్యాచ్, బెస్ట్ రనౌట్‌కు కాకుండా మ్యాచ్ ఆసాంతం ఫీల్డ్‌లో చురుకుగా కదిలిన ఆటగాడికి ఈ అవార్డు అందజేస్తామని స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడని చెప్పిన దిలీప్.. శ్రేయస్ అయ్యర్ రెండు క్యాచ్‌లు అందుకున్నాడని తెలిపాడు.
ఇక విరాట్ కోహ్లీ ఓ స్టన్నింగ్ క్యాచ్‌తో పాటు మైదానంలో తన ఫీల్డింగ్‌తో నిలకడ చూపించాడని కొనియాడాడు. తనదైన ఫీల్డింగ్‌తో సహచర ఆటగాళ్లలో జోష్ చూపించాడని చెప్పాడు. దాంతోనే అతనికి ఈ అవార్డు అందజేస్తున్నామని తెలిపాడు. ఇక కోహ్లీకి ఈ అవార్డు అందజేస్తుండగా.. మెడలో వేయాలని సూచించాడు. మెడల్‌ను వేసిన అనంతరం దాన్ని కొరుకుతూ విరాట్ ఫోజిచ్చాడు.
ఆసియా గేమ్స్‌లో భారత ఆటగాళ్లు పతకాల మోత మోగించిన విషయాన్ని తెలియజేస్తూ విరాట్ కోహ్లీ ఇలా సెలెబ్రేట్ చేసుకున్నాడు. దాంతో డ్రెస్సింగ్ రూమ్‌లో నవ్వులు పూసాయి. ఈ వీడియోను బీసీసీఐ షేర్ చేయగా.. వైరల్‌గా మారింది.