World Cup 2023, Happy Birthday Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నేడు(నవంబర్ 5) 35వ జన్మదినం జరుపుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో కింగ్ కోహ్లీకి అభిమానులు, సహచర ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లు, సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు.
ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ చూసినా.. మరే వెబ్‌సైట్‌ను కదిలించినా కోహ్లీ సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. 35 ఏళ్ల వయసుకు వచ్చిన కోహ్లీ 18 ఏళ్ల కుర్రాడిలా ఫిట్‌నెస్ మెయింటేన్ చేస్తున్నాడు. ఫిట్‌నెస్ విషయంలో అత్యంత కఠినంగా ఉండే కోహ్లీ అందుకోసం తన డైట్‌ను కూడా పూర్తిగా మార్చేసాడు.

కెరీర్ ప్రారంభంలో టామ్ బాయ్‌లా బొద్దుగా కనిపించిన కోహ్లీ.. ఇప్పుడు ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా మారాడు. టీమిండియాలోని ఆటగాళ్లంతా ఏదో ఒక సందర్భంలో గాయాల బారిన పడి జట్టుకు దూరం కాగా.. విరాట్ కోహ్లీ మాత్రం ఒక్కసారి కూడా గాయం కారణంగా మ్యాచ్‌కు దూరం కాలేదు. అయితే ఫిట్ నెస్ ఫ్రీక్‌గా మారడం వెనుక ఎంతో కఠోర శ్రమ దాగి ఉంది.
గంటల కొద్ది జిమ్ చేయడంతో పాటు కఠిన ఆహార నియమాలు కోహ్లీకి పూర్తి ఫిట్‌నెస్ అందించాయి. ఫిట్‌నెస్ కోహ్లీ తనకు ఇష్టమైన మాంసాహారానికి దూరమయ్యాడు. పాల ఉత్పత్పులను కూడా తీసుకోవడం లేదు. ఇక నాన్ వెజ్ మానేయడానికి గల కారణాన్ని కోహ్లీ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. అతని బర్త్ డే నేపథ్యంలో ఆ వీడియో మరోసారి నెట్టింట వైరల్‌గా మారింది.
ఫిట్‌నెస్ కోసమే నాన్‌వెజ్ మానేయలేదని, తన ఆరోగ్య సమస్యను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కోహ్లీ స్పష్టం చేశాడు.
'నా ఆరోగ్య సమస్యను పరిష్కరించుకోవడానికే నాన్‌వెజ్ తినడం మానేసాను. నాకు ఉన్నట్లుండి మెడ నుంచి భుజం వైపు తీవ్ర నొప్పి వచ్చింది. ఒక రాత్రి మొత్తం నిద్రపోలేకపోయాను. ఒక పొజిషన్‌లో 10-15 నిమిషాలు పడుకోలేకపోయాను. వెన్నుపూసలో బల్జెస్ వచ్చాయి. దాంతో ఆక్యూపెంచర్ ట్రీట్‌మెంట్ నిపుణిడిని కలిసాను.
అతను నా పొట్టలో యాసిడ్స్ ఎక్కువయ్యాయని చెప్పాడు. దాంతో నా ఎమ్ముకల్లో ఉన్న కాల్షియంను లివర్ తీసుకుంటుండటంతో ఈ నొప్పి వస్తుందని తెలిపాడు. పొట్టలో యాసిడ్స్ తగ్గించుకోమని చెప్పాడు. మాంసాహారం తక్కువ తీసుకోవాలని సూచించాడు. దాంతో రాత్రికి రాత్రే నా డైట్‌ను మార్చేసాను. నాన్‌వెజ్‌ను పూర్తిగా పక్కనపెట్టేసాను.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.