న్యూఢిల్లీ: భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. భారత్ వేదికగా అక్టోబర్-నవంబర్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఈ షెడ్యూల్‌పై మాట్లాడిన విరాట్ కోహ్లీ మాటలను ఐసీసీ అభిమానులతో పంచుకుంది.
యువ ప్లేయర్‌గా 12 ఏళ్ల క్రితం భారత్‌లో వన్డే ప్రపంచకప్ ఆడానని, మళ్లీ ఆ మూమెంట్స్‌ను ఆస్వాదించేందుకు, అభిమానులకు అందించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని కోహ్లీ తెలిపాడు. '23 ఏళ్లు ఉన్నప్పుడు 2011 వన్డే వరల్డ్ కప్ ఆడాను. అప్పుడు సీనియర్ ఆటగాళ్లపై ఎంతటి అంచనాలు ఉంటాయో కూడా నాకు తెలియదు. ఈసారి నేనే సీనియర్‌గా ప్రపంచ కప్ ఆడబోతున్నా.

స్వదేశంలో వరల్డ్ కప్ ఆడటం అంటే ఎంత స్పెషలో నాకు బాగా తెలుసు. ప్రతీ క్రికెటర్ జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి అనుభవాన్ని అనుభూతి చెందాల్సిందే. ముంబైలో వరల్డ్ కప్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నా. ఎందుకంటే 2011 వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లో జరిగిన ప్రతీ సన్నివేశం నా కళ్ల ముందు ఇంకా అలాగే నిలిచి ఉంది. మరోసారి అక్కడ వరల్డ్ కప్ మ్యాచ్ ఆడాలని అనుకుంటున్నా.' అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.
ఇక క్రికెట్ అనేది తమకు ఉద్యోగం కాదని అంతకంటే ఎక్కువని కోహ్లీ తెలిపాడు. 'క్రికెట్ మాకు ఉద్యోగం మాత్రమే కాదు. అంతకంటే ఎక్కువ. గేమ్ కోసం మేం ఏదైనా చేసేందుకు రెడీగా ఉంటాం. క్రికెట్‌కు ఎంతో విలువనిస్తాం. ఇండియన్ కల్చర్‌లో క్రికెట్ ఓ భాగమైపోయింది. ప్రజల జీవన విధానంలో ఒకటిగా నిలిచిపోయింది.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
వన్డే ప్రపంచకప్‌లో అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుండగా.. అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 15న జరిగే మ్యాచ్‌లో దాయాదీ పాకిస్థాన్‌తో తలపడనుంది. నవంబర్ 15, 16న ముంబై, కోల్‌కతా వేదికగా సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరగనుండగా.. అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.

రెండు సెమీ ఫైనల్స్‌తోపాటు ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే (నవంబర్ 20)ను కేటాయించారు. ప్రపంచకప్ మ్యాచ్‌లను ధర్మశాల, ఢిల్లీ, లక్నో, పుణే, ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా వేదికలుగా మ్యాచ్‌లు జరగనున్నాయి.