చెన్నై: వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా శుభారంభం చేసింది. వన్డే క్రికెట్‌లో మరోసారి విశ్వవిజేతగా నిలిచే లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తొలి అడుగును బలంగా వేసింది. ఆస్ట్రేలియాతో చెన్నై వేదికగా ఆదివారం జరిగిన లోస్కోరింగ్ థ్రిల్లర్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
బౌలింగ్‌లో స్పిన్నర్లు సత్తా చాటగా.. బ్యాటింగ్‌లో చేజింగ్ కింగ్ విరాట్ కోహ్లీ, క్లాస్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సూపర్ బ్యాటింగ్‌తో జట్టుకు విజయాన్ని అందించారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.3 ఓవర్లలో 199 పరుగులకు కుప్పకూలింది. స్టీవ్ స్మిత్(71 బంతుల్లో 5 ఫోర్లతో 46), డేవిడ్ వార్నర్(52 బంతుల్లో 6 ఫోర్లతో 41) టాప్ స్కోరర్లుగా నిలిచారు. చివర్లో మిచెల్ స్టార్క్(35 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 28) విలువైన పరుగులు జోడించాడు.
భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(3/28) మూడు వికెట్లుతీయగా.. కుల్దీప్ యాదవ్(2/42), జస్‌ప్రీత్ బుమ్రా(2/35) రెండేసి వికెట్లు తీసారు. మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 41.2 ఓవర్లలో 4 వికెట్లకు 201 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లీ(116 బంతుల్లో 6 ఫోర్లతో 85), కేఎల్ రాహుల్(115 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 97 నాటౌట్) చెలరేగారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్ మూడు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్ ఓ వికెట్ తీసాడు.
2 పరుగులు 3 వికెట్లు..:200 స్వల్ప లక్ష్యచేధనకు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. 2 పరుగుల వ్యవధిలోనే టాప్-3 వికెట్లు కోల్పోయింది. ఆసీస్ పేసర్ల ధాటికి ముగ్గురు బ్యాటర్లు డకౌట్‌గా వెనుదిరిగారు. మిచెల్ స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో ఓపెనర్ ఇషాన్ కిషన్(0) గోల్డెన్ డక్‌గా వెనుదిరగ్గా.. హజెల్ వుడ్ వేసిన రెండో ఓవర్‌లో రోహిత్ శర్మ కూడా డకౌటయ్యాడు.
కోహ్లీ క్యాచ్ నేలపాలు..:రోహిత్ శర్మ వికెట్ల ముందు దొరికిపోయాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఇదే ఓవర్ చివరి బంతికి శ్రేయస్ అయ్యర్ కూడా చెత్త షాట్‌తో డకౌటయ్యాడు. ఈ పరిస్థితుల్లో కేఎల్ రాహుల్‌తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఇక హజెల్ వుడ్ వేసిన 8వ ఓవర్‌లో విరాట్ కోహ్లీ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను మిచెల్ మార్ష్ నేలపాలు చేశాడు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న విరాట్ కోహ్లీ.. జాగ్రత్తగా బ్యాటింగ్ చేశాడు. పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితమైన ఈ జోడీ క్విక్ సింగిల్స్, డబుల్స్‌పైనే పూర్తిగా ఫోకస్ పెట్టింది. దాంతో పవర్ ప్లేలో టీమిండియా 3 వికెట్లకు 27 పరుగులే చేసింది. అనంతరం ఆడమ్ జంపాను కమిన్స్ బరిలోకి దించగా.. రాహుల్ అటాకింగ్ గేమ్ ఆడాడు. వరుస బౌండరీలతో కాస్త దూకుడు కనబర్చాడు.
హాఫ్ సెంచరీలతో..:స్వల్ప లక్ష్యం కావడంతో క్రీజులో సెట్ అయ్యేందుకు ఈ జోడీ టైమ్ తీసుకుంది. ఎలాంటి రిస్క్ లేకుండా నిదానంగా పరుగులు రాబట్టింది. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ 75 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే కేఎల్ రాహుల్ 72 బంతుల్లో అర్థ శతకం నమోదు చేశాడు. హాఫ్ సెంచరీల అనంతరం కూడా ఈ జోడీ ఎలాంటి రిస్కీ షాట్స్ ఆడకుండా ఇన్నింగ్స్‌ను ముందుకునడిపించింది.
సెంచరీ దిశగా సాగుతున్న విరాట్ కోహ్లీని హజెల్ వుడ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో నాలుగో వికెట్‌కు నమోదైన 165 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనవసర షాట్‌తో కోహ్లీ మూల్యం చెల్లించుకున్నాడు. 15 పరుగుల దూరంలో సెంచరీ చేజార్చుకున్నాడు. క్రీజులోకి హార్దిక్ పాండ్యా రాగా.. రాహుల్ ధాటిగా ఆడి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.