న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్రను లిఖించాడు. ఐసీసీ వైట్‌బాల్ క్రికెట్ టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలోనే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. ఈ టోర్నీలో వరుసగా రెండో హాఫ్ సెంచరీ నమోదు చేసిన కోహ్లీ 55 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ ఇన్నింగ్స్‌తో కోహ్లీ ఐసీసీ వైట్‌బాల్ టోర్నీల్లో ఇప్పటి వరకు 67 మ్యాచ్‌లు ఆడి 2311 పరుగులు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. సచిన్ టెండూల్కర్ 61 మ్యాచ్‌ల్లో 2278 పరుగులు, కుమార సంగక్కర 2193 రన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఐసీసీ టోర్నీల్లో బెస్ట్ యావరేజ్ కలిగిన ప్లేయర్ కూడా విరాట్ కోహ్లీనే కావడం విశేషం. వన్డే ప్రపంచకప్‌లో 50.86 సగటుతో పరుగులు చేసిన విరాట్.. టీ20 ప్రపంచకప్ 81.50 యావరేజ్‌తో బ్యాటింగ్ చేశాడు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ 88.16 సగటుతో రన్స్ చేశాడు. మూడు ఫార్మాట్ల ఐసీసీ టోర్నీలో 50+ యావరేజ్ ఉన్న ఏకైక ప్లేయర్ విరాట్ కోహ్లీ కావడం విశేషం.
ఈ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్లతో గెలవగా.. ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 8 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. కెప్టెన్ హష్మతుల్లా షాహిది(88 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 80), అజ్మతుల్లా ఓమర్జీ(69 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 62) టాప్ స్కోరర్లుగా నిలిచారు. జస్‌ప్రీత్ బుమ్రా(4/34) నాలుగు వికెట్లతో అఫ్గానిస్థాన్ పతనాన్ని శాసించాడు.
హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీయగా... శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్‌కు తలో వికెట్ దక్కింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్.. 35 ఓవర్లలో 2 వికెట్లకు 273 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ రోహిత్ శర్మ(84 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్స్‌లతో 131) శతక్కొట్టగా.. విరాట్ కోహ్లీ(56 బంతుల్లో 6 ఫోర్లతో 55 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. అఫ్గాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ ఒక్కడే రెండు వికెట్లు తీసాడు.