World Cup 2023, IND vs NED: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సాధించాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో వరుసగా అత్యధిక విజయాలు అందించిన టీమిండియా కెప్టెన్‌గా నిలిచాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
ఈ విజయంతో 9 మ్యాచ్‌లకు 9 గెలిచి ఓటమెరుగని జట్టుగా లీగ్ దశను ముగించిన టీమిండియా.. సరికొత్త రికార్డ్‌ను నమోదు చేసింది. ఈ క్రమంలో దిగ్గజ సారథి సౌరవ్ గంగూలీ పేరిట ఉన్న రికార్డ్‌ను రోహిత్ శర్మ అధిగమించాడు. 2003 వన్డే ప్రపంచకప్‌లో సౌరవ్ గంగూలీ సారథ్యంలోని టీమిండియా వరుసగా విజయాలు సాధించింది. ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది.

ఈ జాబితాలో ఆస్ట్రేలియా టాప్‌లో ఉంది. రికీ పాంటింగ్ సారథ్యంలో ఆసీస్.. 2003, 2007 వన్డే ప్రపంచకప్‌ల్లో వరుసగా 11 మ్యాచ్‌లు గెలిచింది. ఈ రెండు టోర్నీల్లో ఓటమెరుగని జట్లుగా నిలిచిన ఆసీస్.. రెండు సార్లు విశ్వవిజేతగా నిలిచింది. 2015 వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ వరుసగా 8 మ్యాచ్‌లు గెలిచి ఫైనల్లో ఆసీస్ చేతిలో ఖంగుతిన్నది.
తాజా టోర్నీలో టీమిండియా సెమీస్‌తో పాటు ఫైనల్ గెలిస్తే ఆసీస్ రికార్డ్‌ను సమం చేయనుంది. ఓటమెరుగని జట్టుగా పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచిన భారత్.. బుధవారం ముంబై వేదికగా జరిగే తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే లీగ్ దశలో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా.. సెమీస్‌లోనూ ఓడించి గత ప్రపంచకప్ ఓటమికి బదులు తీర్చుకోవాలనుకుంటోంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 410 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్(94 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 128 నాటౌట్), కేఎల్ రాహుల్(64 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 102) విధ్వంసకర శతకాలతో చెలరేగగా.. రోహిత్ శర్మ(54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61), శుభ్‌మన్ గిల్(32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51), విరాట్ కోహ్లీ(56 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.
నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డీ లీడే రెండు వికెట్లు తీయగా.. పాల్ వాన్ మెకెరెన్, వాన్ డెర్ మెర్వే తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన నెదర్లాండ్స్ 47.5 ఓవర్లలో 250 పరుగులకు కుప్పకూలింది. తెలుగు తేజం తేజ నిడమనూరు(39 బంతుల్లో ఫోర్, 6 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీ రాణించగా.. సైబ్రాండ్(80 బంతుల్లో 4 ఫోర్లతో 45), కోలిన్ అకెర్‌మన్(32 బంతుల్లో 6 ఫోర్లతో 35) పర్వాలేదనిపించారు.
భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీయగా.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు చెరొక వికెట్ దక్కింది. విధ్వంసకర శతకంతో టీమిండియాకు భారీ స్కోర్ అందించిన శ్రేయస్ అయ్యర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.