న్యూఢిల్లీ: పటిష్టమైన ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లపై విజయం సాధిస్తే టీమిండియా సునాయసంగా వన్డే ప్రపంచకప్ గెలుస్తుందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీలో టీమిండియా అక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడనుంది. అనంతరం అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా పాకిస్థాన్‌తో తలపడనుంది.
ఈ రెండు మ్యాచ్‌లు గెలిస్తే టీమిండియాకు తిరుగుండదని గవాస్కర్ ఓ చానెల్‌తో మాట్లాడుతూ తెలిపాడు. 'ఆస్ట్రేలియాకు పటిష్టమైన బౌలింగ్ యూనిట్ ఉంది. భారత్‌లో అయినా ఎక్కడైనా ఆస్ట్రేలియాపై గెలవడం అంత సులువు కాదు. అలాంటి బౌలింగ్ యూనిట్ ఉన్న జట్టులో మొదటి మ్యాచ్ ఆడటం టీమిండియాకు చాలా మంచి అడ్వాంటేజ్.

ఎందుకంటే ఆస్ట్రేలియా గెలిస్తే, మిగిలిన జట్లను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు. ఆస్ట్రేలియాపై ఓడిపోతే, మిగిలిన జట్లతో ఎలా ఆడాలో క్లారిటీ వస్తుంది. ప్రణాళికలు, వ్యూహాలు మార్చుకునేందుకు, పదును పెట్టుకోవడానికి ఆస్కారం దొరుకుతుంది. పాకిస్థాన్ జట్టుకు కూడా మంచి బౌలింగ్ యూనిట్ ఉంది. మొదటి 3 మ్యాచుల్లో రెండు తప్పక గెలవాల్సిన మ్యాచులు ఆడుతోంది.
ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌లపై గెలిస్తే మిగిలిన జట్లను ఓడించడం టీమిండియాకు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా వంటి పెద్ద జట్లను సొంతగడ్డపై ఓడించేందుకు ఏం చేయాలో టీమిండియాకు బాగా తెలుసు. బలమైన ప్రత్యర్థులను తొలుత ఎదుర్కొంటే, ఆ తర్వాత బలహీనమైన జట్లతోనే మ్యాచులు ఉంటాయి.
వాటిని ఓడించడానికి ఏం చేయాలో, ఎలాంటి మార్జిన్‌తో గెలవాలో టీమిండియాకి తెలుస్తుంది. అయితే ఓవర్ కాన్ఫిడెన్స్ ఏ మాత్రం పనికి రాదు.సెమీస్‌లో గెలిస్తే, అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్‌లో ప్రత్యర్థి ఎవ్వరైనా ఓడించడం పెద్ద కష్టం కాదని అనుకుంటున్నా.'అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.