న్యూఢిల్లీ: సౌతాఫ్రికా క్రికెట్ టీమ్ చరిత్ర సృష్టించింది. వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుగా రికార్డు నమోదు చేసింది. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు దుమ్మురేపారు. బౌండరీల సునామీతో సెంచరీల మోత మోగించారు.
ఒకరు కాదు..ఇద్దరు కాదు మొత్తం ముగ్గురు బ్యాటర్లు శతక్కొట్టార. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 428 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్(84 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 100), రాసీ వాన్ డెర్ డస్సెన్(110 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 108), ఎయిడెన్ మార్క్‌రమ్(54 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 106) సెంచరీలతో కదం తొక్కారు. డేవిడ్ మిల్లర్(21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39 నాటౌట్), హెన్రీచ్ క్లాసెన్(20 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 32) మెరుపులు మెరిపించారు. సౌతాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్ టెంబా బవుమా(8) ఒక్కడే విఫలమయ్యాడు.

శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుషంక(2/86) రెండు వికెట్లు తీయగా.. కాసున్ రజిత(1/90), మతీష పతీరణ(1/95), దునిత్ వెల్లలాగే(1/81) తలో వికెట్ తీసారు. సౌతాఫ్రికా బ్యాటర్ల ధాటికి పోటాపడి పరుగులు సమర్పించుకున్నారు.
ప్రపంచకప్ చరిత్రలోనే 428 పరుగులతో భారీ స్కోర్ నమోదు చేసిన సౌతాఫ్రికా.. ఆస్ట్రేలియా(413), భారత్(411), సౌతాఫ్రికా(411), సౌతాఫ్రికా(408) రికార్డులను అధిగమించింది. వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే సౌతాఫ్రికాకు ఇది మూడో 400 ప్లస్ స్కోర్.
వన్డే క్రికెట్ చరిత్రలో 400 ప్లస్ రన్స్ చేయడం సౌతాఫ్రికాకు ఇది 8వ సారి. ఈ మ్యాచ్‌లో మార్క్‌రమ్ 49 బంతుల్లోనే సెంచరీ అందుకొని వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు.
వన్డే క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాటర్లు సెంచరీ చేయడం ఇది మూడోసారి. ఈ మూడు సార్లు కూడా సౌతాఫ్రికా బ్యాటర్లే ఈ ఫీట్ సాధించడం గమనార్హం. తొలి 10 ఓవర్లలో 48 పరుగులే చేసిన సౌతాఫ్రికా 10- 20 ఓవర్లలో 70 పరుగులు.. 21-30 ఓవర్లలో 88, 31-40 ఓవర్లలో 85, 40-50 ఓవర్లలో 137 పరుగులు చేసింది.