చెన్నై: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా పాకిస్థాన్‌తో అసలు సిసలు పోరుకు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్. డెంగ్యూ బారిన పడి చెన్నైలోనే ఉండిపోయిన టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. నేడు(బుధవారం) అహ్మదాబాద్ చేరుకోనున్నాడు. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా దాయాదీ దేశాలు తలపడనున్నాయి.
ఇప్పటికే పాకిస్థాన్ జట్టు అహ్మదాబాద్ చేరుకోగా.. భారత్ మాత్రం ఢిల్లీలో అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా అహ్మదాబాద్ చేరుకోనుంది. డెంగ్యూ కారణంగా తొలి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న శుభ్‌మన్ గిల్.. పాకిస్థాన్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనంతరం శుభ్‌మన్ గిల్ రక్తకణాల సంఖ్య లక్షలోపు పడిపోవడంతో అతన్ని చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు.

ఈ విషయాన్ని టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అఫ్గాన్ మ్యాచ్‌కు ముందు తెలియజేశాడు. అయితే సాయంత్రానికే శుభ్‌మన్ గిల్‌ను డిశ్చార్జ్ చేశారని, హోటల్‌లో బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో అతను రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని, డెంగ్యూ నుంచి కోలుకుంటున్నాడని, అతన్ని పర్యవేక్షిస్తున్న మెడికల్ టీమ్ సభ్యుడు ఒకరు మీడియాకు తెలియజేశారు.
బుధవారం కమర్షియల్ ఫ్లైట్‌లో గిల్.. అహ్మదాబాద్ చేరుకుంటాడని చెప్పాడు. 'శుభ్‌మన్ గిల్ కమర్షియల్ ఫ్లైట్‌లో బుధవారం చెన్నై నుంచి అహ్మదాబాద్‌కు బయల్దేరుతాడు. బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణలోనే అతను డెంగ్యూకు చికిత్స తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటాడు.'అని సదరు అధికారి తెలిపాడు.
పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ఇంకా 3 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో శుభ్‌మన్ గిల్‌కు పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. ఒకవేళ అతను పూర్తిగా కోలుకొని ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంటే శనివారం మ్యాచ్ ఆడుతాడు. పూర్తిగా కోలుకోకుంటే మాత్రం టీమిండియా అతనికి మరింత రెస్ట్ ఇవ్వనుంది. గిల్ ఆడించి టీమిండియా మేనేజ్‌మెంట్ ఏ మాత్రం రిస్క్ చేయదు.
గిల్ కోలుకోకపోతే.. బ్యాకప్ ఓపెనర్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ను తీసుకునే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో విజయం సాధించి శుభారంభం చేసిన టీమిండియా.. అఫ్గాన్‌ను ఓడించేందుకు సిద్దమవుతోంది. మరోవైపు పాకిస్థాన్ నెదర్లాండ్స్, శ్రీలంకను ఓడించి జోరు మీద ఉంది.