న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్ వేదికగా అక్టోబర్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన వెంటనే ఈ షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 5న ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తికరంగా చూసే భారత్-పాక్ పోరు అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా అక్టోబర్7న నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం కావడంతో పాటు లక్ష సీట్ల సామర్థ్యం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారత్-పాక్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్‌ను సొమ్ముచేసుకునేందుకు బీసీసీఐ ఈ వేదికను ఎంచుకున్నట్లు అర్థమవుతోంది.

వన్డే ప్రపంచకప్‌లో మొత్తం 48 మ్యాచ్‌లు జరగనుండగా.. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, గువహతి, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, ఇండోర్, రాజ్‌కోట్, ముంబైలతో పాటు అహ్మదాబాద్ మైదానాలను షార్ట్‌లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మూడు నాకౌట్ రౌండ్స్‌లోని 48 మ్యాచ్‌లు.. 46 రోజులు జరగనున్నాయి.
భారత్ ఆడే మ్యాచ్‌లను ఏడు వేదికలు మాత్రమే ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉంది.
ఒకవేళ భారత్ ఫైనల్ చేరితే.. మాత్రం అహ్మదాబాద్‌లో రెండు సార్లు ఆడనుంది. బీసీసీఐ వర్గాల ప్రకారం పాకిస్థాన్ తమ మ్యాచ్‌లను ఎక్కువగా బెంగళూరు, చెన్నై, కోల్‌కతాలోనే ఆడనుంది. భద్రతా కారణాలతోనే పాక్‌ను ఈ మూడు వేదికలకు పరిమితం చేసినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ తమ మ్యాచ్‌లను కోల్‌కతా, గువహతి వేదికగానే ఆడనుంది.
తమ దేశ అభిమానులు వచ్చేందుకు ఈజీగా ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. వేదికల ఎంపికల విషయంలో బీసీసీఐ.. టీమిండియా మేనేజ్‌మెంట్ సలహాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికాలతో జరిగే మ్యాచ్‌లకు స్పిన్ వికెట్లను తయారు చేయాలని బీసీసీఐని టీమిండియా మేనేజ్‌మెంట్ కోరినట్లు సమాచారం.