న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్‌కు గోల్డెన్ టికెట్ అందజేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ధన్యవాదాలు తెలియజేశాడు. ప్రపంచకప్ గోల్డెన్ టికెట్ అందుకోవడంపై సంతోషం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ట్విటర్ వేదికగా బీసీసీఐతో పాటు సెక్రటరీ జైషాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాడు.
'వన్డే ప్రపంచకప్‌కు సంబంధించిన గోల్డెన్ టికెట్‌ను అందుకోవడంపై సంతోషంగా ఉన్నాను. విశిష్ట అతిథిగా నన్ను గుర్తించిన బీసీసీఐకి ప్రత్యేక ధన్యవాదాలు. డియర్ జైషాజీ... మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. మీ ఆప్యాయతతో కూడిన మాటలు, ఆలోచనలకు కృతజ్ఞతలు.'అని రజినీకాంత్ ట్వీట్ చేశాడు.

మంగళవారం బీసీసీఐ కార్యదర్శి జై షా.. రజినీకాంత్‌ను చెన్నైలో కలిసి ప్రపంచకప్ బంగారు టికెట్‌ను అందించి టోర్నీకి ఆహ్వానించారు. ''తలైవా ప్రపంచకప్‌కు విశిష్ట అతిథిగా హాజరై టోర్నీకి మరింత వెలుగు తెస్తారని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం'' అని బీసీసీఐ ట్వీట్ చేసింది. అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్‌తో సహా పలువురు ప్రముఖులకు బీసీసీఐ బంగారు టికెట్ అందజేసిన సంగతి తెలిసిందే.
ప్రపంచకప్ వచ్చే నెల 5న అహ్మదాబాద్‌లో ఆరంభం కానున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు తలపడనున్నాయి. ఆస్ట్రేలియాతో అక్టోబర్ 8న జరిగే తొలి మ్యాచ్‌తో టీమిండియా ప్రపంచకప్ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది.
అక్టోబర్ 14న పాకిస్థాన్‌తో అహ్మదాబాద్ వేదికగా హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఇటీవలే ముగిసిన ఆసియాకప్ 2023 టైటిల్ గెలిచిన టీమిండియా ఫుల్ జోష్‌లో ఉంది. వన్డే ప్రపంచకప్ ముంగిట పటిష్ట ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సెలెక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
ఆసియాకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో గాయపడిన ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను తొలి రెండు వన్డేలకు పక్కనపెట్టారు. అతని స్థానంలో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను జట్టులోకి తీసుకున్నారు. తెలుగు తేజం తిలక్ వర్మకు మరోసారి అవకాశమిచ్చారు. తొలి రెండు వన్డేలకు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతినిచ్చారు.
రజనీకాంత్ నటించిన జైలర్ మూవీ ఇటీవలే విడుదలై బాక్సాఫిస్‌ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 650 కోట్ల గ్రాస్ రాబట్టింది. రూ. 600 కోట్లు ధాటిన రెండో తమిళన చిత్రంగా నిలిచింది.