లక్నో: వన్డే ప్రపంచకప్ 2023లో సౌతాఫ్రికా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ క్వింటన్ డికాక్ (106 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 109) దుమ్మురేపుతున్నాడు. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో శతక్కొట్టిన డికాక్.. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లోనూ సెంచరీ నమోదు చేశాడు. మెగా టోర్నీల్లో వరుసగా రెండు సెంచరీలు నమోదు చేసిన బ్యాటర్‌గా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
డికాక్ విధ్వంసకర శతకంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 311 పరుగులు చేసింది. డికాక్ శతకానికి తోడుగా ఎయిడెన్ మార్క్‌రమ్(44 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో గ్లేన్ మ్యాక్స్‌వెల్ రెండు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, జోష్ హజెల్ వుడ్, ప్యాట్ కమిన్స్, ఆడమ్ జంపా తలో వికెట్ తీసారు.

అదిరిపోయే ఆరంభం..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు ఓపెనర్లు టెంబా బవుమా(35), క్వింటన్ డికాక్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడిన ఈ జోడీ వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. దాంతో సౌతాఫ్రికా పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది.
అనంతరం మరింత ధాటిగా ఆడిన ఈ జోడీ వేగంగా పరుగులు చేసింది. ఈ క్రమంలో డికాక్ 51 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో సౌతాఫ్రికా 17.4 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసుకుంది. క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని గ్లేన్ మ్యాక్స్‌వెల్ విడదీసాడు. టెంబా బవుమాను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి తొలి వికెట్‌కు నమోదైన 108 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు.
90 బంతుల్లో సెంచరీ..
బవుమా ఔటైనా.. డికాక్ తన జోరును తగ్గించలేదు. రాసీ వాన్ డెర్ డస్సెన్(26) సాయంతో రెండో వికెట్‌కు 50 పరుగులు జోడించాడు. వాన్ డెర్ డస్సెన్‌ను ఆడమ్ జంపా క్యాచ్ ఔట్ చేయగా.. ఎయిడెన్ మార్క్‌రమ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 90 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అయితే అతని జోరుకు మ్యాక్స్‌వెల్ కళ్లెం వేసాడు. క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన హెన్రీచ్ క్లాసెన్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మార్క్‌రమ్ మామ.. కమిన్స్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో నాలుగో వికెట్‌కు నమోదైన 67 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్‌లు కూడా విఫలమవడంతో భారీ స్కోర్ చేస్తుందనుకున్న సౌతాఫ్రికా 311 పరుగులకే పరిమితమైంది.