Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: భారత ముస్లింలు మాకే మద్దతు ఇస్తారు.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!

కరాచీ: ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టుకు ఇండియన్ ముస్లిమ్స్ అండగా నిలుస్తారని ఆ జట్టు మాజీ క్రికెటర్ నవీద్ ఉల్ హసన్ అన్నాడు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన నవీద్ ఉల్ హసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'భారత్‌లో ఏ మ్యాచ్ జరిగినా టీమిండియానే ఫేవరేట్‌గా ఉంటుంది. అయితే పాకిస్థాన్ మ్యాచ్ ఉంటే మాత్రం భారత ముస్లింలు మా జట్టుకే మద్దతు ఇస్తారు. భారత్‌ను కాదని మాకు సపోర్ట్ చేస్తారు. గతంలో చాలా సార్లు భారత ముస్లింలు.. పాకిస్థాన్ జట్టుకు అండగా నిలిచారు. పాకిస్థాన్ ఆడే మ్యాచ్‌లకు మా దేశ జెండాలతో హాజరయ్యారు. భారత్‌లో నేను రెండు సిరీస్‌ల్లో ఆడాను. అహ్మదాబాద్, హైదరాబాద్‌లో చాలా మంది భారత ముస్లింలు పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచారు.

 naved-ul-hasan1

భారత్‌లో ఇండియన్ క్రికెట్ లీగ్ ఆడిన అనుభవం కూడా నాకుంది. హైదరాబాద్‌లో మాకు ఊహించని మద్దతు లభించింది. వన్డే ప్రపంచకప్ బరిలోకి దిగే జట్లలో పాకిస్థాన్ జట్టు చాలా బలంగా ఉంది. భారత్ అనే కాదు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా పాకిస్థాన్‌కు మద్దతు లభిస్తోంది.'అని నవీద్ ఉల్ హసన్ చెప్పుకొచ్చాడు.

ఇదే పాడ్‌కాస్ట్‌లో 2005 భారత పర్యటనలో దూకుడుగా ఆడుతున్న సెహ్వాగ్‌ను మాటలతో రెచ్చగొట్టి ఔట్ చేశానని నవీద్ ఉల్ హసన్ గుర్తు చేసుకున్నాడు. 'భారత్‌తో మ్యాచ్‌లో సెహ్వాగ్ 85 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ సిరీస్‌లోనే షాహిద్ అఫ్రిది వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి 2-0తో ఆధిక్యంలో ఉంది. కీలకమైన మూడో వన్డేలో సెహ్వాగ్ మా బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు.

భారత్ 300 పరుగుల భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. అఫ్రిది బౌలింగ్‌లో సెహ్వాగ్ అప్పటికే సిక్స్‌ల మోత మోగించాడు. పాక్ బౌలర్లలో ప్రతీ ఒక్కరు అతని ధాటికి పరుగులు సమర్పించుకున్నారు. నేను వెళ్లి ఇంజమామ్ ఉల్ హక్‌ను బౌలింగ్ చేస్తానని అడిగాను. అలాగే చేయ్.. అందరూ కొట్టించుకున్నారు. నువ్వు కూడా పరుగులు సమర్పించుకో అని ఎటకారంగా మాట్లాడాడు.

బంతిని అందుకున్న నేను సెహ్వాగ్‌కు తొలి బంతి స్లోయర్ బౌన్సర్‌గా వేసాను. దాన్ని సెహ్వాగ్ కనెక్ట్ చేయలేకపోయాడు. వెంటనే నేను అతని దగ్గరకు వెళ్లి 'ఈ బంతి ఎలా ఆడాలో నీకు తెలియదు. నువ్వు పాకిస్థాన్‌లో ఉంటే అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చేవాడివే కాదు.'అని రెచ్చగొట్టాను. దానికి సెహ్వాగ్ కూడా మాటలతో బదులిచ్చాడు.

అతను తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. నేను వెంటనే ఇంజమామ్ దగ్గరకు వెళ్లి.. ఇప్పుడు సెహ్వాగ్ ఔట్ అవుతున్నాడని చెప్పాను. మరుసటి బంతిని బ్యాక్ ఆఫ్ హ్యండ్ స్లోయర్‌గా వేసాను. ఆగ్రహంగా ఉన్న సెహ్వాగ్ భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఈ వికెట్‌ మాకు మూమెంటమ్ అందించడంతో మ్యాచ్ గెలిచాం. ఆ తర్వాత సిరీస్‌ను కూడా సొంతం చేసుకున్నాం.'అని నవీద్ ఉల్ హసన్ చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, July 15, 2023, 15:55 [IST]
Other articles published on Jul 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+