హైదరాబాద్: వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్థాన్ శుభారంభం చేసింది. నెదర్లాండ్స్‌తో ఉప్పల్ మైదానం వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన పాకిస్థాన్ 81 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. బౌలర్లు సత్తా చాటడంతో పాకిస్థాన్ సునాయస విజయాన్నందుకుంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 49 ఓవర్లలో 286 పరుగులకు కుప్పకూలింది. మహమ్మద్ రిజ్వాన్(75 బంతుల్లో 8 ఫోర్లతో 68), సౌద్ షకీల్(52 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 68) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మహమ్మద్ నవాజ్(43 బంతుల్లో 4 ఫోర్లతో 39), షాదాబ్ ఖాన్(34 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 32) కీలక ఇన్నింగ్స్ ఆడారు.

నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డీ లీడ్(4/62) నాలుగు వికెట్లతో పాకిస్థాన్ పతనాన్ని శాసించగా.. కొలిన్ అకెర్‌మన్(2/39) రెండు వికెట్లు తీసాడు. ఆర్యన్ దత్, లోగన్ వాన్ బీక్, పాల్ వాన్ మీకెరెన్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన నెదర్లాండ్స్ 41 ఓవర్లలో 205 పరుగులకు కుప్పకూలింది. బౌలింగ్‌లో 4 వికెట్లతో సత్తా చాటిన బాస్ డీ లీడే(68 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 67)తో పాటు ఓపెనర్ విక్రమ్‌జీత్ సింగ్(67 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు. లొగన్ వాన్ బీక్(28 నాటౌట్) ఒంటరి పోరాటం చేయగా.. తెలుగు తేజం తేజ నిడమనూరు(5) తీవ్రంగా నిరాశపరిచాడు.
పాకిస్థాన్ బౌలర్లలో హ్యారీస్ రౌఫ్(3/43) మూడు వికెట్లు తీయగా.. హసన్ అలీ(2/33) రెండు వికెట్లు పడగొట్టాడు. షాహిన్ షా అఫ్రిది, ఇఫ్తికర్ అహ్మద్, మహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ తలో వికెట్ తీసారు.
బ్యాటింగ్‌లో 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ పాకిస్థాన్‌ను మహమ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్ ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు 120 పరుగులు జోడించారు. చివర్లో మహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ ఏడో వికెట్‌కు 64 పరుగులు జోడించి పాక్‌కు పోరాడే లక్ష్యాన్ని అందించారు.