హైదరాబాద్: వన్డే ప్రపంచకప్ కోసం పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు హైదరాబాద్ చేరుకున్నాయి. దాదాపు ఏడేళ్ల తర్వాత పాకిస్థాన్ జట్టు భారత్‌లో అడుగుపెట్టింది. బుధవారం రాత్రి రాజీవ్‌గాంధీ విమానాశ్రయం నుంచి బస చేసే పార్క్ హయత్ హోటల్‌కు చేరుకునేంత వరకూ పాకిస్థాన్ జట్టుకు హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
ఆటగాళ్ల సెక్యూరిటీ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు రెండు అంచెల భద్రత ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉప్పల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో పాక్ తన తొలి వార్మప్ మ్యాచ్ ఆడనుంది. పాకిస్థాన్ చివరగా 2016 టీ20 ప్రపంచకప్ కోసం భారత్‌కు వచ్చింది.

మరోవైపు న్యూజిలాండ్ జట్టు ఉదయమే హైదరాబాద్ చేరుకుంది. ఆ జట్టుకు ఐటీసీ కాకతీయ హోటల్లో బస ఏర్పాటు చేశారు. నగరంలో శుక్రవారం వినాయక నిమజ్జనం ఉండటంతో వామప్ మ్యాచ్‌కు భద్రత కల్పించలేమని హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. దాంతో ఈ మ్యాచ్‌ను ప్రేక్షకుల్లేకుండానే నిర్వహించేందుకు హెచ్‌సీఏ సిద్దమైంది.
కుడి చేతి బొటన వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఫాస్ట్‌బౌలర్ టిమ్ సౌథీ ప్రపంచకప్‌లో ఆడే న్యూజిలాండ్ జట్టుతో చేరనున్నాడు. 34 ఏళ్ల సౌథీ ఈ నెలలో ఇంగ్లండ్‌తో వన్డే మ్యాచ్ సందర్భంగా క్యాచ్ పట్టే ప్రయత్నంలో గాయపడ్డాడు. తమ జట్టు తొలి మ్యాచ్ (అక్టోబరు 5న) సమయానికి సౌథీ కోలుకుంటాడని కివీస్ ఆశిస్తోంది.
'భారత్‌లో జట్టుతో చేరేందుకు సౌథీకి అనుమతి లభించింది. వేలి గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న అతడు కోలుకుంటున్నాడు'' అని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. ఉప్పల్ మైదానం వేదికగా పాక్, న్యూజిలాండ్ జట్లు ప్రాక్టీస్ కూడా ప్రారంభించాయి.
అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుండగా.. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ తలపడనున్నాయి. అక్టోబర్ 14న భారత్-పాకిస్థాన్ మధ్య అహ్మదాబాద్ వేదికగా హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.