World Cup 2023: 'టైమ్డ్ ఔట్'ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైన అంశం. 24 గంటల ముందు వరకు మెజార్టీ అభిమానులకు ఈ రూల్ గురించి పెద్దగా తెలియదు. అసలు ఇలా కూడా ఔటిస్తారా? అని ఆశ్చర్యపోయినవారున్నారు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక స్టార్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔట్ అవ్వడం వివాదాస్పదమైంది.
146 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే టైమ్డ్ ఔట్ అయిన తొలి ప్లేయర్‌గా మాథ్యూస్ నిలిచాడు. ఐసీసీ ప్రపంచకప్ రూల్స్ ప్రకారం బ్యాటర్ ఔటైన తర్వాత ఇన్‌కమింగ్ ప్లేయర్ 2 నిమిషాల్లోపు మరో బంతిని ఎదుర్కోవాలి. కానీ ఏంజెలో మాథ్యూస్ ఆలస్యం చేశాడని గుర్తించిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అంపైర్ దృష్టికి తీసుకెళ్లగా.. వారు టీవీ అంపైర్‌తో చర్చించి ఔటిచ్చారు.

బచాయించిన దాదా: మాథ్యూస్ రిక్వెస్ట్ చేసినా షకీబ్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దాంతో టైమ్డ్ ఔట్ అయిన ప్లేయర్‌గా మాథ్యూస్ చరిత్రలో నిలిచిపోయాడు. అయితే మాథ్యూస్ కంటే ముందే టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గూంగూలీ టైమ్డ్ ఔట్ కావాల్సింది. కానీ సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ క్రీడా స్పూర్తి కారణంగా 6 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన దాదా.. ఔటవ్వకుండా బచాయించాడు.
2007 సౌతాఫ్రికా పర్యటనలో: టీమిండియా 2007 సౌతాఫ్రికా పర్యటనలో ఈ ఘటన చోటు చేసుకుంది. సౌతాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్ సందర్భంగా దాదా బ్యాటింగ్‌కు ఆలస్యంగా వచ్చాడు. ఈ మ్యాచ్‌లో భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి సచిన్ టెండూల్కర్ రావాల్సి ఉండగా.. అంపైర్లు అనుమతించలేదు.
సచిన్‌ను అనుమతించకపోవడంతో: సౌతాఫ్రికా బ్యాటింగ్ సందర్భంగా సచిన్ టెండూల్కర్ నిర్ణీత సమయం మైదానంలో ఫీల్డింగ్ చేయకపోవడంతో అతన్ని బ్యాటింగ్ చేయనివ్వలేదు. ఐదో స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ బ్యాటింగ్ చేయాల్సి ఉండగా.. అతను స్నానానికి వెళ్లాడు. దాంతో గంగూలీ హడావుడిగా ప్యాడ్లు కట్టుకొని, బ్యాట్ పట్టుకొని క్రీజులోకి వచ్చాడు. అతను వచ్చేసరికి ఆరు నిమిషాలు పట్టింది.

గ్రేమ్ స్మిత్ క్రీడా స్పూర్తి: ఎంసీసీ క్రికెట్ రూల్స్ ప్రకారం టైమ్డ్ ఔట్ కోసం అప్పీల్ చేయడానికి అప్పటి సౌతాఫ్రికా కెప్టెన్ గ్రేమ్ స్మిత్‌కు అవకాశం ఉంది. కానీ సౌతాఫ్రికా కెప్టెన్ మాత్రం ఆ పని చేయలేదు. ఆ మ్యాచ్ అంపైర్ డారెల్ హార్పర్ ఈ రూల్ గురించి చెప్పినప్పటికీ.. స్మిత్ అప్పీల్ చేయలేదు. కొత్తగా వచ్చే బ్యాటర్ ఆలస్యంగా వస్తే.. దానికి తగిన కారణాలు ఉన్నాయని భావిస్తే.. టైమ్డ్ ఔట్‌ను పరిగణనలోకి తీసుకోవద్దని ఫీల్డింగ్ జట్టు కెప్టెన్ కోరవచ్చు.
షకీబ్ లాంటోడు ఉంటే..?: 16 ఏళ్ల క్రితం స్మిత్ పరిస్థితిని అర్థం చేసుకొని క్రీడా స్పూర్తిని కనబర్చాడు. అదే షకీబ్ అల్ హసన్ లాంటి కెప్టెన్ ఉండుంటే.. మాథ్యూస్ కంటే ముందే గంగూలీ టైమ్డ్ ఔట్ అయ్యుండేవాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఆ మ్యాచ్‌లో గంగూలీ 89 బంతులు ఆడి 46 పరుగులు మాత్రమే చేశాడు. ఐదు వికెట్ల తేడాతో ఆ టెస్టులో గెలిచిన సౌతాఫ్రికా 2-1 తేడాతో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది.