న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీకి మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. అహ్మదాబాద్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ షురూ కానుంది. ఇప్పటికే ఇరు జట్లు వరల్డ్ బిగ్గెస్ట్ క్రికెట్ స్టేడియం ఉన్న అహ్మదాబాద్‌కు చేరుకోగా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది.
అనూహ్య కారణాలతో ప్రపంచకప్ ఆరంభ వేడుకలను రద్దు చేసినట్లు తెలుస్తోంది. 12 ఏళ్ల తర్వాత భారత్.. మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తుండగా.. అత్యంత సంపన్న బోర్డు అయిన బీసీసీఐ ఓపెనింగ్ సెర్మనీని అంగరంగ వైభవంగా నిర్వహిస్తోందని అంతా భావించారు. అసలే భారత్‌లో క్రికెట్‌ను మతంలా భావిస్తారు.

ఇప్పటికే దేశంలో మెగా టోర్నీ ఫీవర్ మొదలైంది. వార్మప్ మ్యాచ్‌లను చూసేందుకు కూడా ప్రేక్షకులు స్టేడియాలకు పోటెత్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరంభ వేడుకలను రద్దు చేశారనే వార్తలు అభిమానులను షాక్‌కు గురి చేశాయి. ప్రపంచకప్ తొలి మ్యాచ్‌కు ముందు రోజు అంటే నేడు(అక్టోబర్ 4న) ఈ వేడుకను నిర్వహించేందుకు బీసీసీఐ ముందుగా ప్రణాళికలు రచించింది.
ఈ వేడుకల్లో పాల్గొనేందుకు బాలీవుడ్ తారలు రణ్‌వీర్ సింగ్, అరిజిత్ సింగ్, తమన్నా భాటియా, శ్రేయా ఘోషల్, ఆశా భోంస్లేలాంటి వారితో ఒప్పందం కూడా చేసుకుందని వార్తలు వచ్చాయి. ఏమైందో ఏమో తెలియదు కానీ.. తాజాగా ఈ ప్రారంభ వేడుకలను రద్దు చేసినట్లు తెలుస్తోంది.
ఈ వేడుకలను పూర్తిగా రద్దు చేయకుండా టోర్నీ మధ్యలో లేదా చివర్లో నిర్వహించాలని బీసీసీఐ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఓపెనింగ్ సెర్మనీకి బదులుగా.. అక్టోబర్ 14న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రోజుగానీ.. లేదంటే మెగా టోర్నీకి ముగిశాక గానీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని బీసీసీఐ చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఆరంభ వేడుకలను రద్దు చేసినట్లు ఇప్పటి వరకు బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఐపీఎల్ ఆరంభ వేడుకలనే ఘనంగా నిర్వహించే బీసీసీఐ, ప్రపంచకప్ టోర్నీ ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించకపోవడం ఏంటని ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ప్రారంభ వేడుకలు రద్దు చేసినా.. కెప్టెన్స్ డేను మాత్రం యథావిధిగా నిర్వహించనున్నారు. ప్రపంచకప్ ప్రారంభానికి ముందు అన్ని జట్ల కెప్టెన్లతో కలిసి ఫొటో సెషన్ నిర్వహిస్తారు. నేడు (బుధవారం) అహ్మదాబాద్ వేదికగా పది జట్ల కెప్టెన్‌లతో ఫొటో సెషన్, మీడియా సమావేశం నిర్వహిస్తారు.