హైదరాబాద్: వన్డే ప్రపంచకప్ 2023 నేపథ్యంలో న్యూజిలాండ్‌తో ఉప్పల్ వేదికగా జరిగిన వామప్ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓటమిపాలైంది. 345 పరుగుల భారీ స్కోర్ చేసినా విజయాన్నందుకోలేకపోయింది. సమష్టిగా రాణించిన న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 345 పరుగులు చేసింది. మహమ్మద్ రిజ్వాన్(94 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 103) సెంచరీ బాదగా.. బాబర్ ఆజామ్(84 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 80), సౌద్ షకీల్(53 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 75) హాఫ్ సెంచరీలతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ రెండు వికెట్లు తీయగా.. మ్యాట్ హెన్రీ, జేమ్స్ నీషమ్, లూకీ ఫెర్గూసన్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్.. 43.4 ఓవర్లలో 5 వికెట్లకు 346 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఓపెనర్ డెవాన్ కాన్వే(0) విఫలమైనా.. ఓపెనర్ రచిన్ రవీంద్ర(72 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్‌తో 97) సూపర్ బ్యాటింగ్‌తో రాణించాడు. తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు.
కేన్ విలియమ్సన్(50 బంతుల్లో 8 ఫోర్లతో 54), డారిల్ మిచెల్(57 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 59), మార్క్ చాంప్‌మన్(41 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 65 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో ఉసామ మిర్ రెండు వికెట్లు తీయగా.. హసన్ అలీ, అఘా సల్మాన్ తలో వికెట్ తీసారు.