NED vs BAN: వన్డే ప్రపంచకప్ 2023లో మరో సంచలన ఫలితం నమోదైంది. పసికూన నెదర్లాండ్స్ మరో విజయం సాధించింది. బంగ్లాదేశ్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన నెదర్లాండ్స్ 87 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 50 ఓవర్లలో 229 పరుగులకు కుప్పకూలింది.
కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్(89 బంతుల్లో 6 ఫోర్లతో 68) హాఫ్ సెంచరీతో రాణించగా.. వెస్లీ బార్రెసీ(41 బంతుల్లో 8 ఫోర్లతో 41), సైబ్రాండ్(61 బంతుల్లో 3 ఫోర్లతో 35) విలువైన పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో షోరిఫుల్ ఇస్లామ్(2/51), టస్కిన్ అహ్మద్(2/43), ముస్తాఫిజుర్ రెహ్మాన్(2/36), మెహ్‌దీ హసన్(2/40) రెండేసి వికెట్లు తీసారు. షకీబ్ అల్ హసన్(1/37)కు ఓ వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్ 42.2 ఓవర్లలో 142 పరుగులకు కుప్పకూలింది. మెహ్‌దీ హసన్ మీరాజ్(40 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 35) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో పాల్ వాన్ మీకెరెన్(4/23) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. బాస్ డీ లీడే(2/25) రెండు వికెట్లు పడగొట్టాడు. ఆర్యన్ దత్, లోగాన్ వాన్ బీక్, కోలిన్ అకెర్‌మన్ తలో వికెట్ తీసారు.
బంగ్లా బ్యాటర్లలో లిటన్ దాస్(3), తాన్జిద్ హసన్(15), నజ్ముల్ షాంటో(9), షకీబ్ అల్ హసన్(9), ముష్ఫికర్ రహీమ్(1), మహ్మదుల్లా(20), మెహ్‌దీ హసన్(17) దారుణంగా విఫలమయ్యారు. చివర్లో ముస్తాఫిజుర్ రెహ్మాన్(20) పరువు కాపాడే ప్రయత్నం చేసినా.. నెదర్లాండ్స్ బౌలర్లు అవకాశం ఇవ్వలేదు.
నాలుగు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించిన పాల్ వాన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ విజయంతో నెదర్లాండ్స్ బంగ్లాదేశ్‌ను వెనక్కు నెట్టి 8వ స్థానంలో నిలిచింది. సౌతాఫ్రికాను 38 పరుగులతో ఓడించి తొలి సంచలనం నమోదు చేసిన నెదర్లాండ్స్ తాజాగా బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ అట్టడుగు స్థానంలో కొనసాగుతుండటం గమనార్హం.