World Cup 2023, NED vs AFG: వన్డే ప్రపంచకప్ 2023లో అఫ్గానిస్థాన్ సంచలన ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ విజయం సాధించి సెమీస్ దిశగా దూసుకెళ్తోంది. నెదర్లాండ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన అఫ్గానిస్థాన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఇది అఫ్గాన్‌కు నాలుగో విజయం కాగా.. పాయింట్స్ టేబుల్‌లో ఆ జట్టు ఐదో స్థానానికి చేరింది. చివరి రెండు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలను మెరుగైన రన్‌రేట్‌తో ఓడిస్తే అఫ్గాన్ సెమీస్ బెర్త్ ఖరారు కానుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 46.3 ఓవర్లలో 179 పరుగులకు కుప్పకూలింది. సైబ్రాండ్ (86 బంతుల్లో 6 ఫోర్లతో 58) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. మ్యాక్స్ ఓ డౌడ్(42) పర్వాలేదనిపించాడు.
అఫ్గాన్ బౌలర్లలో మహమ్మద్ నబీ(3/28) మూడు వికెట్లు తీయగా.. నూర్ అహ్మద్(2/31) రెండు వికెట్లు పడగొట్టాడు. ముజీబ్ ఉర్ రెహ్మాన్(1/41) ఓ వికెట్ దక్కింది. అఫ్గాన్ సూపర్ ఫీల్డింగ్‌తో నెదర్లాండ్స్ బ్యాటర్లలో నలుగురు రనౌటయ్యారు.
అనంతరం లక్ష్య చేధనకు దిగిన అఫ్గానిస్థాన్ 31.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. రెహ్మత్ షా(54 బంతుల్లో 8 ఫోర్లతో 52), హష్మతుల్లా షాహిది(64 బంతుల్లో 6 ఫోర్లతో 56) హాఫ్ సెంచరీలతో రాణించారు. అజ్మతుల్లా ఓమార్జాయ్(28 బంతుల్లో 3 ఫోర్లతో 31 నాటౌట్) పర్వాలేదనిపించాడు.
నెదర్లాండ్స్ బౌలర్లలో లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ డెర్ మెర్వ్, సాఖిబ్ జుల్ఫికర్ తలో వికెట్ తీసారు.