India vs South Africa: వన్డే ప్రపంచకప్ 2023 నేపథ్యంలో బ్లాక్ మార్కెట్ దందా జోరుగా సాగుతోంది. ఇతర మ్యాచ్‌లకు స్టేడియం మొత్తం ఖాళీగా కనబడుతున్నా.. భారత్ మ్యాచ్‌లకు మాత్రం కిక్కిరిసిపోతున్నాయి. భారత్ ఆడే మ్యాచ్‌లు చూసేందుకు అభిమానులు ఎగబడుతుండటంతో.. బ్లాక్ బకాసురుల పంట పండుతోంది.
ఒక్కో టికెట్‌ను 6 రెట్ల ఎక్కువ ధరకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా కోల్‌కతాలో బ్లాక్ టికెట్ల అమ్ముతున్న ఓ వ్యక్తిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా వచ్చే ఆదివారం(నవంబర్5) జరగనుంది.

మెగా టోర్నీలో ఇరు జట్లు వరుస విజయాలతో దూసుకెళ్తుండటంతో ఈ పోరుపై సర్వత్రా ఆసక్తినెలకొంది. పైగా ఆ రోజు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బర్త్ డే కావడం.. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించడంతో ఈ మ్యాచ్‌కు విపరీతమైన హైప్ ఏర్పడింది.
ఎలాగైనా ఈ మ్యాచ్ చూడాలని అభిమానులు టికెట్ల కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆన్‌లైన్ వేదికగా ఇప్పటికే టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. దాంతో బ్లాక్ బకాసురులు అభిమానుల క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటున్నారు. మంగళవారం ఓ వ్యక్తి రూ.2500 టికెట్‌ను రూ.11000 ధరకు అమ్ముతుండగా కోల్‌కతా పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్ట్ చేశారు.
అతని వద్ద ఉన్న 20 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్ టికెట్లు అమ్ముతున్నారనే సమాచారంతో నిందితుడైన అంకిత్ అగర్వాల్(32) ఇంటిపై రైడ్ చేసిన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది. ఒక్కో టికెట్‌ను ఐదు రెట్లకు అమ్ముకోవడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు.
వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా ఇప్పటికే సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. వరుసగా 6 మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్స్ టేబుల్‌లో టాప్‌లో నిలిచిన రోహిత్ శర్మ.. శ్రీలంకతో గురువారం జరిగే మ్యాచ్‌లో విజయం సాధించి అధికారికంగా సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకోవాలనుకుంటోంది.