న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆతిథ్యంపై ఇంగ్లండ్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో అసహనం వ్యక్తం చేశాడు. వన్డే ప్రపంచకప్ కోసం భారత్‌కు వచ్చిన ఇంగ్లండ్ జట్టుకు సౌకర్యవంతమైన సదుపాయాలు కల్పించలేదని బెయిర్ స్టో ఆగ్రహం వ్యక్తం చేశాడు.
వరల్డ్ కప్ 2023 నేపథ్యంలో భారత్‌తో శనివారం జరగనున్న వామప్ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ జట్టు గువాహతి చేరుకుంది. అయితే ఇంగ్లండ్ నుంచి గువహతి వరకు ఎకానమీ క్లాస్‌లోనే ప్రయాణించడంపై బెయిర్ స్టో అసహనం వ్యక్తం చేశాడు. దాదాపు 38 గంటలపాటు ఎకానమీ క్లాస్‌లోనే ప్రయాణించినట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నాడు.

ఇదంతా తీవ్ర అయోమయానికి గురి చేసిందన్న బెయిర్ స్టో... ఇతర ప్రయాణికులతో కలిసి ఒకే విమానంలో భారత్‌కు చేరుకున్నట్లు వెల్లడించాడు. ''అంతా గందరగోళంగా మారిపోయింది. విమానంలోకి అడుగు పెట్టిన తర్వాత దాదాపు 38 గంటలకుపైగా ప్రయాణం సాగింది'' అని బెయిర్‌స్టో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నాడు.
బెయిర్‌స్టో షేర్ చేసిన ఫొటోలో కెప్టెన్ జోస్ బట్లర్‌తో పాటు క్రిస్ వోక్స్ ఉన్నాడు. వారిద్దరితోపాటు ఇతర ప్రయాణికులు కూడా ఉన్నారు. ఎకానమీ క్లాస్ టికెట్స్ బుక్ చేసింది ఎవరా? అనేదానిపై మాత్రం క్లారిటీ లేదు. సహజంగా జట్టులోని ప్రధాన ఆటగాళ్లకు బిజినెస్ క్లాస్ టికెట్స్ బుక్ చేస్తారు. మిగతా ఆటగాళ్లకు మాత్రం ఎకానమీ క్లాస్ టికెట్ బుక్ చేస్తారు.
కీలక ఆటగాళ్లకు విశ్రాంతి కావాల్సినప్పుడు ప్రధాన ఆటగాళ్ల తమ బిజినెస్ క్లాస్ టికెట్స్‌ను వారికి కేటాయిస్తారు. ఇంగ్లండ్ ఆటగాళ్ల విషయంలోనూ ఇదే జరిగినట్లు అర్థమవుతోంది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం గువాహటికి భారత్, ఇంగ్లండ్ ఆటగాళ్లు చేరిపోయారు. శనివారం ఇరు దేశాల మధ్య వార్మప్ మ్యాచ్ జరగనుంది. ఇంగ్లండ్ ఆటగాళ్లు మొయిన్ అలీ, అదిల్ రషీద్, జో రూట్, బెన్ స్టోక్స్‌తోపాటు సహాయక, కోచింగ్ సిబ్బంది జట్టు కోసం కేటాయించిన బస్సులో హోటల్‌కు చేరారు.
అక్టోబర్ 5న వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుండగా.. తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య జరగనుంది.
ప్రపంచకప్ బరిలోకి దిగే ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, గాస్ అట్కిన్‌సన్, జానీ బెయిర్‌స్టో, హారీ బ్రూక్, సామ్ కరన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, అదిల్ రషీద్, జో రూట్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లే, డేవిడ్ విల్లే, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్