న్యూఢిల్లీ: క్రికెట్‌లో సెంచరీ చేసినప్పుడు బ్యాట్స్‌మన్, వికెట్ తీసినప్పుడు బౌలర్లు సంబరాలు చేసుకుంటారు. ఒక్కో ప్లేయర్ ఒక్కో శైలిని అనుసరిస్తుంటారు. చాలా మంది బ్యాటర్లు బ్యాట్‌ను పైకెత్తుతూ ఆకాశం వైపు చూస్తూ గట్టి అరుస్తూ సంబరాలు చేసుకుంటే.. కొందరు గాల్లోకి ఎగురుతూ పంచ్‌లు ఇస్తూ తమ ఆనందాన్ని వ్యక్త పరుస్తారు.
బౌలర్లు సైతం వికెట్ తీసిన వెంటనే గట్టిగా అరుస్తుంటారు. కొందరైతే తమదైన శైలిలో చిందులేస్తుంటారు. క్రికెటర్ల సెలెబ్రేషన్స్‌లో విండీస్ ఆటగాళ్లు ప్రత్యేకం. గంగమ్ స్టైల్ డ్యాన్స్‌తో పాటు.. సెల్యూట్, నోట్ బుక్ స్టైల్ సంబరాలను అనుసరిస్తూ అభిమానులను అలరిస్తుంటారు. కాస్త మౌనంగా ఉండే భారత ఆటగాళ్లు కూడా ఇప్పుడు వినూత్నమైన సంబరాలతో అభిమానులను అలరిస్తున్నారు.

ముఖ్యంగా భారత బౌలర్లు స్టార్ ఫుట్‌బాలర్స్ సెలెబ్రేషన్స్‌కు కాపీ కొడుతున్నారు. ఇప్పటికే టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్.. దిగ్గజ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో సియూ సెలెబ్రేషన్స్‌ను అనుకరిస్తుండగా.. తాజాగా యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా కూడా ఈ జాబితాలో చేరాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా.. అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బుమ్రా .. ఓపెనర్ ఇబ్రహీమ్ జడ్రాన్(22)ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు.
అనంతరం మాంచెస్టర్ యునైటెడ్ ఫార్వార్డ్ ప్లేయర్ మార్కస్ రాష్‌ఫోర్డ్ సెలెబ్రేషన్‌ను అనుకరించాడు. నెత్తికి చూపుడు వేలు పెడుతూ..దిమాక్‌తో ఔట్ చేసాననే సైగలు చేశాడు. మార్కస్ రాష్ ఫోర్డ్ సైతం గోల్ చేసిన వెంటనే ఇలానే సెలెబ్రేట్ చేసుకుంటాడు. ప్రస్తుతం ఈ సెలెబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్ 63 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. జడ్రాన్‌ను బుమ్రా ఔట్ చేయగా.. రెహ్మనుల్లా గుర్బాజ్(21)ను హార్దిక్ పాండ్యా పెవిలియన్ చేర్చాడు. రెహ్మత్‌షా(16)ను లార్డ్ శార్దూల్ ఠాకూర్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు.