World Cup 2023: పాకిస్థాన్ పేలవ ప్రదర్శన.. ఇంజమామ్ ఉల్ హక్ సంచలన నిర్ణయం!
World Cup 2023లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శన నేపథ్యంలో ఆ జట్టు దిగ్గజ క్రికెటర్, చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పాకిస్థాన్ వరుస ఓటములకు బాధ్యత వహిస్తూ.. తన చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామా చేశాడు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చీఫ్ జాకా అష్రఫ్‌కు పంపించారు.
వన్డే ప్రపంచకప్ 2023లో రెండు విజయాలతో శుభారంభం చేసిన పాకిస్థాన్.. ఆ తర్వాత వరుసగా 4 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. భారత్, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, సౌతాఫ్రికా చేతిలో ఓటమిపాలైంది.

ఈ పరాజయాల నేపథ్యంలో ఇంజమామ్ ఉల్ హక్ తన చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామా చేశాడు. ఇంజమామ్ ఉల్ హక్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో పీసీబీపై ఆర్థిక భారం పడనుంది. ఇంజమామ్ ఉల్ హక్‌కు పీసీబీ 15 మిలియన్ల పాకిస్థాన్ రూపాయలను నష్టపరిహారంగా చెల్లించాల్సి ఉంటుందని ఆ దేశ మీడియా పేర్కొంది. ఇది అతని ఆరు నెలల జీతానికి సమానమని తెలిపింది.
ఇక ఇంజమామ్ ఉల్ హక్‌పై పరస్పర విరుద్ద ప్రయోజనాల ఆరోపణలు వచ్చాయి. ప్లేయర్స్ మేనేజ్‌మెంట్ కోసం రిజిస్టర్ చేయబడిన కంపెనీలో ఇంజమామ్‌కు వాటా ఉందనే ప్రచారం జరిగింది.
ఈ కంపెనీ పాకిస్థాన్ స్టార్ క్రికెటర్లు బాబర్ ఆజామ్, మహమ్మద్ రిజ్వాన్, షాహిన్ షా అఫ్రిది వంటి స్టార్ ఆటగాళ్లకు ప్రాతినిథ్యం వహిస్తోంది. వారి వాణిజ్య ఒప్పందాలు.. ఇతర కార్యక్రమాలను పర్యవేక్షిస్తోంది. మహమ్మద్ రిజ్వాన్‌కు కూడా ఈ కంపెనీలో వాటా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ కంపెనీలో వాటాదారుడిగా ఉన్న ఇంజమామ్ ఉల్ హక్.. టీమ్ సెలెక్షన్ ప్రక్రియలో పక్షపాతంగా వ్యవహరించారని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వచ్చాయి.
ఇక పీసీబీ, ఆటగాళ్ల మధ్య సెంట్రల్ కాంట్రాక్ట్‌కు సంబంధించి వివాదం నెలకొంది. ఐసీసీ నుంచి పీసీబీ అందే సొమ్ములో వాటా ఇవ్వాలని ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు. మెగా టోర్నీ సందర్భంగా వాణిజ్య ప్రకటనలను బహిష్కరించే అవకాశాన్ని కూడా వారు పరిశీలించినట్లు వార్తలు వచ్చాయి.
ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్న ఇంజమామ్ ఉల్ హక్.. పీసీబీ, ఆటగాళ్ల మధ్య మధ్యవర్తిత్వం వహించి ఈ వివాదాన్ని పరిష్కరించినట్లు ప్రచారం జరిగింది. ఆటగాళ్ల డిమాండ్లను పీసీబీ కూడా అంగీకరించిందని సమాచారం. ఈ వ్యవహారంతోనే ఇంజమామ్ ఉల్ హక్ చీఫ్ సెలెక్టర్ పదవిపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆటగాళ్ల తరఫున మధ్యవర్తిత్వం వహించడం పరస్పర ప్రయోజనాల కిందికే వస్తుందనే వాదనకు బలం చేకూర్చింది.
ఈ ఆరోపణలు.. పాకిస్థాన్ వరుస పరాజయాలతో ఇంజమామ్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ప్రజలు ఆధారాలు లేకుండా అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఇంజమామ్ మండిపడ్డాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications