న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌కు సంబంధించిన హైడ్రామాకు తెరపడింది. మెగా టోర్నీ రీషెడ్యూల్‌ను ఐసీసీ బుధవారం ప్రకటించింది. మొత్తం 9 మ్యాచ్‌ల తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురు చూస్తున్న భారత్-పాకిస్థాన్ హైఓల్టేజ్ మ్యాచ్‌ను అక్టోబర్ 14కు రీషెడ్యూల్ చేశారు.
దేవీ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఒక రోజు ముందుకు జరిపారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ అక్టోబర్ 15న జరగాల్సింది. కానీ గుజరాత్‌లో అదే రోజు దేవీ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. భద్రతా పరంగా సమస్యలు తలెత్తుతాయని ఆ రాష్ట్ర హోం శాఖ సూచనలతో బీసీసీఐ ఈ మ్యాచ్‌ను రీ షెడ్యూల్ చేసింది.

అక్టోబర్ 14న జరగాల్సిన ఇంగ్లండ్-అఫ్గానిస్థాన్ మ్యాచ్‌ను అక్టోబర్ 15కు రీషెడ్యూల్ చేశారు. పాకిస్థాన్-శ్రీలంక మధ్య హైదరాబాద్ వేదికగా అక్టోబర్ 12(గురువారం)న జరగాల్సిన మ్యాచ్ అక్టోబర్ 10కి వాయిదా వేసింది. అక్టోబర్ 13న లక్నో వేదికగా జరగాల్సిన ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మ్యాచ్‌ను అక్టోబర్ 12కు మార్చారు.
నవంబర్ 12న పాకిస్థాన్-ఇంగ్లండ్ మధ్య కోల్‌కతా వేదికగా జరగాల్సిన మ్యాచ్‌ను భద్రతా కారణాలతో నవంబర్11కు మార్చారు. కోల్‌కతాలో కాళీ పూజ నేపథ్యంలో భద్రతా సమస్యలు తలెత్తుతాయని ఈ నిర్ణయం తీసుకున్నారు. నెదర్లాండ్స్‌తో భారత్ ఆడనున్న తన చివరి లీగ్ మ్యాచ్ తేదీని కూడా మార్చారు. నవంబర్ 11 నుంచి 12న నిర్వహించనున్నారు.
పాక్-ఇంగ్లండ్ మ్యాచ్‌లో మార్పు చేయడంతో భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేయాల్సి వచ్చింది. అక్టోబర్ 5న ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుండగా.. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ మెగా మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.
అక్టోబర్ 14న పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌తో భారత్ తమ క్యాంపయిన్‌ను ప్రారంభించనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.