World Cup 2023, IND vs ENG: వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. లక్నో వేదికగా ఆదివారం డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే లక్నో చేరిన టీమిండియా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది.
చీలమండ గాయంతో న్యూజిలాండ్‌తో జరిగిన గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. రేపటి మ్యాచ్ కూడా ఆడటం లేదు. ప్రస్తుతం ఎన్‌సీఏలో చికిత్స తీసుకుంటున్న అతను.. మరో 3 మ్యాచ్‌ల వరకు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
హార్దిక్ దూరమవడం టీమిండియాకు పెద్ద లోటుగా మారింది.

అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌లో ఎక్స్‌ట్రా ఆప్షన్ లేకుండా పోయింది. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో హార్దిక్ స్థానాన్ని భర్తీ చేసేందుకు టీమిండియా స్పెషలిస్ట్ బ్యాటర్ అయిన సూర్యకుమార్ యాదవ్‌తో పాటు ప్రధాన పేసర్ మహమ్మద్ షమీని తుది జట్టులోకి తీసుకొచ్చింది. పేస్ ఆల్‌రౌండర్ అయిన శార్దూల్ ఠాకూర్‌ను పక్కనపెట్టింది.
ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లోనూ ఇదే కాంబినేషన్‌నే కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్పిన్ వికెట్ అయితే మాత్రం అశ్విన్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఎవరూ వచ్చినా హార్దిక్ పాండ్యా లేకపోవడంతో టీమిండియాకు ఆరో బౌలింగ్ ఆప్షన్ లేకుండా పోయింది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ విషయం స్పష్టంగా తెలుసొచ్చింది.
ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఈ సమస్య తలెత్తకుండా ఉండేందుకు టీమిండియా మాస్టర్ ప్లాన్ సిద్దం చేస్తోంది. ఆరో బౌలింగ్ ఆప్షన్‌ను భర్తీ చేసేందుకు పార్ట్ టైమ్ బౌలర్లను సిద్దం చేస్తోంది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్‌తో ఒకటి రెండు ఓవర్లు వేయించాలనే ప్రణాళికలు రచిస్తోంది.
మీడియం పేసర్ అయిన విరాట్ కోహ్లీ ఇప్పటికే ఈ టోర్నీలో బౌలింగ్ చేశాడు. బంగ్లాతో మ్యాచ్‌లో గాయపడి మైదానం వీడిన హార్దిక్ పాండ్యా ఓవర్‌ను కోహ్లీనే పూర్తి చేశాడు. గతంలోనూ కోహ్లీకి బౌలింగ్ చేసిన అనుభవం ఉంది. సూర్యకుమార్ యాదవ్ సైతం దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ బౌలింగ్ చేశాడు. కానీ శుభ్‌మన్ గిల్ మాత్రం ఇప్పటి వరకు బౌలింగ్ చేయలేదు.
శుక్రవారం ఆప్షనల్ ప్రాక్టీస్ అయినప్పటికీ ఈ ముగ్గురు నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. రోహిత్, శ్రేయస్ అయ్యర్‌లకు సూర్య అరగంటకు పైగా బౌలింగ్ చేశాడు. అతని బౌలింగ్‌కు అశ్విన్ ఫిదా అయ్యాడు. శుభ్‌మన్ గిల్.. మహమ్మద్ సిరాజ్‌కు 30 నిమిషాల పాటు బౌలింగ్ చేశాడు. తన బౌలింగ్‌తో సిరాజ్‌ను ఇబ్బంది పెట్టాడు.
కోహ్లీ సైతం అర గంటకు పైనే బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఈ ముగ్గురితో హార్దిక్ లేని లోటును భర్తీ చేసేందుకు టీమిండియా ప్రణాళికలను సిద్దం చేస్తోంది.