చెన్నై: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు దుమ్మురేపారు. రవీంద్ర జడేజా(3/28) తీన్మార్ బౌలింగ్‌కు కుల్దీప్ యాదవ్(2/42), జస్‌ప్రీత్ బుమ్రా(2/35) దోబార్ బౌలింగ్ తోడవ్వడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 199 పరుగులకు కుప్పకూలింది.
ఆసీస్ ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్(71 బంతుల్లో 5 ఫోర్లతో 46), డేవిడ్ వార్నర్(52 బంతుల్లో 6 ఫోర్లతో 41) టాప్ స్కోరర్లుగా నిలిచారు. చివర్లో మిచెల్ స్టార్క్(35 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 28) విలువైన పరుగులు జోడించాడు. భారత బౌలర్లలో జడేజా, కుల్దీప్, బుమ్రాకు తోడుగా.. మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీసారు.

200 పరుగుల లక్ష్యం భారత జట్టుకు పెద్ద కష్టం కాదు. సంచలనాలు జరిగే తప్పా.. ఈ మ్యాచ్‌లో భారత్‌ను ఓడించడం ఆసీస్‌కు కష్టమే.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే డేంజరస్ బ్యాటర్ మిచెల్ మార్ష్(0) డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్‌తో మిచెల్ మార్ష్ ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన స్మిత్‌తో కలిసి డేవిడ్ వార్నర్ ఆచితూచి ఆడాడు. దాంతో పవర్ ప్లేలో ఆసీస్ వికెట్ నష్టానికి 43 పరుగులే చేసింది.
ఓవైపు స్మిత్ డిఫెన్స్‌కే పరిమితమైనా.. వార్నర్ తనదైన శైలిలో బౌండరీలు బాదాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో వార్నర్‌కు లైఫ్ లభించింది. అతనిచ్చిన రిటర్న్ క్యాచ్‌ను హార్దిక్ అందుకోలేకపోయాడు. ఈ అవకాశంతో మరింత చెలరేగిన అతను వేగంగా పరుగులు రాబట్టాడు. క్రీజులో పాతుకుపోయిన వార్నర్‌ను కుల్దీప్ యాదవ్ బోల్తా కొట్టించాడు. స్టన్నింగ్ డెలివరీతో రిటర్న్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 69 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
క్రీజులోకి వచ్చిన మార్నస్ లబుషేన్‌తో కలిసి స్మిత్ నిదానంగా ఆడాడు. జిడ్డు బ్యాటింగ్‌తో బౌలర్లతో పాటు అభిమానులను విసిగించాడు. చివరకు రవీంద్ర జడేజా స్టన్నింగ్ డెలివరీకి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. స్మిత్ ఔటైన వెంటనే ఆసీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది.
జడేజా తన మరుసటి ఓవర్‌లో లబుషేన్(27), అలెక్స్ క్యారీ(0)లను పెవిలియన్ చేర్చాడు. గ్లేన్ మ్యాక్స్‌వెల్(15)ను కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేయగా.. కామెరూన్ గ్రీన్(8)ను అశ్విన్ ఔట్ చేశాడు. దాంతో ఆసీస్ 140 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టల్లో పడింది. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు.
ఓ సిక్స్, బౌండరీతో దూకుడు కనబర్చిన అతన్ని బుమ్రా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత మిచెల్ స్టార్క్ ధాటిగా ఆడే ప్రయత్నం చేయగా.. జంపాను హార్దిక్ పాండ్యా ఔట్ చేశాడు. చివరి వికెట్‌గా స్టార్క్‌ను సిరాజ్ ఔట్ చేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది.