న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా(4/34) దుమ్మురేపాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 8 వికెట్లకు 272 పరుగులే చేసింది. హష్మతుల్లా షాహిది(88 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 80), అజ్మతుల్లా ఓమర్జీ(69 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 62) హాఫ్ సెంచరీలతో రాణించారు.
భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టాడు. శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్‌కు తలో వికెట్ దక్కింది.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ ఇబ్రహీం జడ్రాన్(22)ను బుమ్రా కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రెహ్మత్ షా(16)తో కలిసి రెహ్మనుల్లా గుర్బాజ్ ఆచితూచి ఆడాడు. దాంతో పవర్ ప్లేలో అఫ్గాన్ వికెట్ నష్టానికి 48 రన్స్ చేసింది.
క్రీజులో సెట్ అయ్యే ప్రయత్నం చేసిన ఈ జోడీని హార్దిక్ పాండ్యా విడదీసాడు. రెహ్వానుల్లా గుర్బాజ్(21) క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే రెహ్మత్ షా(16)ను శార్దూల్ ఠాకూర్ వికెట్లు ముందు బోల్తా కొట్టించడంతో అఫ్గాన్ 63 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన హష్మతుల్లా షాహిది, అజ్మతుల్లా ఓమార్జీ అఫ్గాన్‌ను ఆదుకున్నారు.
ఆచితూచి ఆడిన ఈ జోడీ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. ఈ క్రమంలో అజ్మతుల్లా ఓమార్జీ 62 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. కాసేపటికే హష్ముతుల్లా షాహిదీ 58 బంతుల్లో అర్థ శతకం నమోదు చేశాడు. 121 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని హార్దిక్ పాండ్యా విడదీసాడు.
సూపర్ డెలివరీతో అజ్మతుల్లా ఓమార్జీని క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి వచ్చిన నబీ(19)తో కలిసి షాహిదీ సెంచరీ దిశగా సాగాడు. కానీ కుల్దీప్ యాదవ్ అతన్ని వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. ఆ వెంటనే ఓకే ఓవర్‌లో నజిబుల్లా జడ్రాన్(2), మహమ్మద్ నబీలను బుమ్రా పెవిలియన్ చేర్చాడు. దాంతో భారీ స్కోర్ చేస్తుందనుకున్న అఫ్గాన్ సాధారణ స్కోర్‌కే పరిమితమైంది.