న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా మరో విజయాన్ని నమోదు చేసింది. అఫ్గానిస్థాన్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ రోహిత్ శర్మ(84 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్స్‌లతో 131) సూపర్ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(56 బంతుల్లో 6 ఫోర్లతో 55 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 8 వికెట్లకు 272 పరుగులే చేసింది. హష్మతుల్లా షాహిది(88 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 80), అజ్మతుల్లా ఓమర్జీ(69 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 62) హాఫ్ సెంచరీలతో రాణించారు. జస్‌ప్రీత్ బుమ్రా(4/34) అఫ్గాన్ పతనాన్ని శాసించారు. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టాడు. శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్‌కు తలో వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్.. రోహిత్ సెంచరీ, కోహ్లీ అజేయ హాఫ్ సెంచరీతో 35 ఓవర్లలో 2 వికెట్లకు 273 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఓపెనర్ ఇషాన్ కిషన్(47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47), శ్రేయస్ అయ్యర్(23 బంతుల్లో ఫోర్, సిక్సర్‌తో 25 నాటౌట్) రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ ఒక్కడే రెండు వికెట్లు తీసాడు.
272 పరుగుల సాధారణ లక్ష్య చేధనకు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా రోహిత్ టీ20 తరహా బ్యాటింగ్‌తో అఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో టీమిండియా పవర్ ప్లేలోనే వికెట్ నష్టపోకుండా 94 పరుగులు చేసింది.
హాఫ్ సెంచరీ అనంతరం రోహిత్ శర్మ మరింత ధాటిగా ఆడాడు. దాంతో టీమిండియా 17 ఓవర్లలోనే 140 పరుగులు చేసింది. 63 బంతుల్లో రోహిత్ సెంచరీ మార్క్ అందుకోగా.. హాఫ్ సెంచరీ చేరువైన ఇషాన్ కిషన్‌ను రషీద్ ఖాన్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 156 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ శర్మ అదే జోరు కొనసాగించాడు. భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ప్రమాదకరంగా మారిన రోహిత్ శర్మను రషీద్ ఖాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 49 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్‌తో కలిసి విరాట్ కోహ్లీ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ క్రమంలో అతను 55 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌ను ఆదివారం పాకిస్థాన్‌తో ఆడనుంది.