హైదరాబాద్: వన్డే ప్రపంచకప్ 2023కి మరో రెండు రోజుల్లో తెరలేవనుంది. భారత్ వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్న వేదికలన్నీ ముస్తాబయ్యాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం వేదికగా కూడా రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో భారత్ మ్యాచ్ లేకపోయినా.. పాకిస్థాన్, నెదర్లాండ్స్, శ్రీలంక జట్లతో తలపడనుంది.
ఇప్పటికే ఉప్పల్ మైదానం వేదికగా రెండు వామప్ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో ఆతిథ్యం ఇచ్చే మైదానాల రినోవేషన్ కోసం బీసీసీఐ భారీ స్థాయిలో డబ్బులు కేటాయించింది. ఉప్పల్ మైదానంలో కూడా మరమ్మత్తులు చేశారు. స్టేడియం పైకప్పులను రిపేర్ చేయడంతో పాటు కొత్త సీట్లను కూడా ఏర్పాటు చేశారు.

అయితే ప్రపంచకప్ టోర్నీకి మరో 2 రోజుల్లోనే తెరలేవనుండగా.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధికారులు మాత్రం నిద్రమత్తు వీడటం లేదు. అక్టోబర్ 6న ఉప్పల్ మైదానం వేదికగా తొలి మ్యాచ్ జరగాల్సి ఉండగా.. మరమ్మత్తుల పనులను ఇప్పటికీ పూర్తి చేయలేదు. కనీసం కుర్చీలను కూడా పూర్తిగా మార్చలేదు.
వినాయక నిమజ్జనం నేపథ్యంలో పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి వామప్ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించలేదు. కానీ ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మధ్య జరిగిన రెండో వామప్ మ్యాచ్‌కు ఫ్యాన్స్‌ను అనుమతించడంతో హెచ్‌సీఏ నిర్లక్ష్యం బట్టబయలైంది. వెస్టన్ టెర్రాస్ సీట్లను ఏ మాత్రం మార్చలేదు.
పాత సీట్లను అలానే వదిలేసిన అధికారులు.. కనీసం వాటిని శుభ్రం కూడా చేయించలేదు. దాంతో సీట్లన్నీ కాకిరెట్టలతో దారుణంగా ఉన్నాయి. ప్రముఖ తెలుగు కామెంటేటర్ సీ వెంకటేశ్ ఈ వామప్ మ్యాచ్‌కు హాజరవ్వగా ఈ సీట్లను చూసి ఆయన షాకయ్యారు. వెంటనే ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకొని హెచ్‌సీఏ నిర్లక్ష్యాన్ని బట్ట బయలు చేశారు.
వెంకటేశ్ వీడియోలు క్షణాల్లో వైరల్ కాగా.. హెచ్‌సీఏపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే ఇదే అదునుగా చేసుకొని ఇతర దేశాలు బీసీసీఐపై విమర్శలు గుప్పించే ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రయత్నాలను వెంకటేశ్ అడ్డుకున్నారు. స్టేడియం మొత్తం బాగుందని, టెర్రాస్ సీట్లను శుభ్రం చేయలేదని స్పష్టం చేశారు.
ఈ ఫొటోలను అవకాశంగా చేసుకొని బీసీసీఐని విమర్శించడం సరికాని సూచించారు. ఇక ఈ వామప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 14 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 351 పరుగులు చేసింది. గ్లేన్ మ్యాక్స్‌వెల్(71 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌లతో 77), కామెరూన్ గ్రీన్(40 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 50) హాఫ్ సెంచరీతో రాణించారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 47.4 ఓవర్లలో 337 పరుగులకు కుప్పకూలింది. ఇఫ్తికర్ అహ్మద్(85 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 83), బాబర్ ఆజామ్(59 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 90) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు.