World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023లో అరుదైన రికార్డ్ నమోదైంది. 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక శతకాలు నమోదైన సీజన్‌గా ఈ ఎడిషన్ నిలిచింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ (116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101) సెంచరీ చేయడంతో ఈ అరుదైన రికార్డ్ నమోదైంది.
ఈ టోర్నీలో మిల్లర్ సాధించిన సెంచరీ 39వ శతకం. ఈ 39లో డికాక్ 4, కోహ్లీ, రచిన్ మూడేసి సెంచరీలు చేశారు. డారిల్ మిచెల్, శ్రేయస్ అయ్యర్, డేవిడ్ వార్నర్, డస్సెన్, మార్ష్, మ్యాక్స్‌వెల్ రెండేసి శతకాలు నమోదు చేశారు.

రోహిత్, మార్క్‌రమ్, రాహుల్‌తో పాటు మరికొందరు ఒక్కో శతకం బాదారు. ఇక వరల్డ్ కప్ నాకౌట్స్‌లో శతకం బాదిన తొలి సౌతాఫ్రికా బ్యాటర్‌గా డేవిడ్ మిల్లర్ చరిత్రకెక్కాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులకు కుప్పకూలింది. డేవిడ్ మిల్లర్(116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101) ఒక్కడే సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు.

అతనికి తోడుగా హెన్రీచ్ క్లాసెన్(48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47) రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ మూడేసి వికెట్లు తీయగా.. జోష్ హజెల్ వుడ్, ట్రావిస్ హెడ్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన సౌతాఫ్రికాను క్లాసెన్, డేవిడ్ మిల్లర్ ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు నమోదైన 91 పరుగులు జోడించాడు.
లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా.. 3 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసి విజయం దిశగా సాగుతోంది.