World Cup 2023 Final: రోహిత్ శర్మ సూపర్ కెప్టెన్సీ.. విరాట్ కోహ్లీ సెంచరీల మోత.. మహమ్మద్ షమీ అత్యధిక వికెట్ల ప్రదర్శన.. ఏవి కూడా టీమిండియాను విశ్వ విజేతగా నిలబెట్టలేకపోయాయి. తిరుగులేని ఆటతో ఎదురు వచ్చిన ప్రతీ జట్టును మట్టికరిపించిన టీమిండియా.. అసలు సిసలు పోరులో మాత్రం తేలిపోయింది.
పేలవ బ్యాటింగ్, చెత్త బౌలింగ్‌కు దురదృష్టం కూడా తోడవడంతో మరోసారి తృటిలో ప్రపంచకప్‌ను చేజార్చుకుంది. ప్రత్యర్థి ప్రణాళికల ముందు చిత్తయ్యింది. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఫైనల్లో సమష్టిగా విఫలమైన టీమిండియా 6 వికెట్ల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో 140 కోట్ల భారతీయులకు గుండె కోతను మిగిల్చింది.

2003 పరాజయాన్నే రిపీట్ చేస్తూ మరోసారి ఆస్ట్రేలియాకే టైటిల్ కట్టబెట్టింది. నాకౌట్ మ్యాచ్‌లంటే చెలరేగిపోయే ఆసీస్ మరోసారి అసాధారణ ప్రదర్శనతో ఆరో టైటిల్‌ను సొంతం చేసుకుంది. టాస్ గెలవడం.. కండిషన్స్‌కు తగ్గట్లు ఆడటం.. డ్యూ రావడం ఆ జట్టుకు కలిసొచ్చింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు కుప్పకూలింది. . విరాట్ కోహ్లీ(63 బంతుల్లో 4 ఫోర్లతో 53), కేఎల్ రాహుల్(107 బంతుల్లో ఫోర్‌తో 66), రోహిత్ శర్మ(31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 47)లు మినహా అంతా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, జోష్ హజెల్ వుడ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. గ్లేన్ మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపా తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా 43 ఓవర్లలో 4 వికెట్లకు 241 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ట్రావిస్ హెడ్(120 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్‌లతో 137) విధ్వంసకర శతకంతో భారత్ పతనాన్ని శాసించాడు. అతనికి తోడుగా మార్నస్ లబుషేన్(110 బంతుల్లో 4 ఫోర్లతో 58 నాటౌట్) రాణించాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, సిరాజ్ ఓ వికెట్ పడగొట్టాడు.
స్వల్ప లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియాకు భారత బౌలర్లు ఆరంభంలోనే షాకిచ్చారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే డేవిడ్ వార్నర్(7)ను షమీ పెవిలియన్ చేర్చగా.. మిచెల్ మార్ష్(15), స్టీవ్ స్మిత్(4)లను బుమ్రా ఔట్ చేశాడు. దాంతో 47 పరుగులకే ఆసీస్ 3 వికెట్లు కోల్పోయింది.
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన మార్నస్ లబుషేన్‌తో కలిసి ట్రావిస్ హెడ్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. పూర్తిగా టెస్ట్ బ్యాటింగ్‌తో ఈ జోడీ క్రీజులో సెట్ అయ్యేందుకు ప్రయత్నించింది. డ్యూ వచ్చే వరకు వేచి చూసిన ఈ జోడీ ఆ తర్వాత పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిన తర్వాత చెలరేగింది. రోహిత్ శర్మ బౌలింగ్ మార్పులు చేసినా.. ఫీల్డ్ సెటప్ మార్చినా.. ఈ జోడీ అవకాశం ఇవ్వలేదు.
58 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసుకున్నట్రావిస్ హెడ్.. ధాటిగా ఆడి 95 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు టెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన లబుషేన్ 99 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో ఆసీస్ విజయం ఖాయమైంది. చివర్లో ట్రావిస్ హెడ్ ఔటైనా..మ్యాక్స్‌వెల్ విజయ లాంఛనాన్నిపూర్తి చేశాడు.