IND vs AUS, Worldcup 2023 Final: ఒక్క మ్యాచ్ ఓడకుండా ఎదురొచ్చిన ప్రతీ ప్రత్యర్థి ఓడిస్తూ ఫైనల్ చేరిన భారత్.. కీలక మ్యాచ్‌లో మాత్రం తడబడుతోంది. విధ్వంసకర బ్యాటింగ్‌తో శతకాల మోత మోగించిన టీమిండియా టాపార్డర్.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్లో మాత్రం దారుణంగా విఫలమైంది. శుభ్‌మన్ గిల్(4), రోహిత్ శర్మ(47), శ్రేయస్ అయ్యర్(4) చేతులెత్తేసారు.
హాఫ్ సెంచరీతో విరాట్ కోహ్లీ(54) ఇన్నింగ్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేసినా.. బ్యాటింగ్ ఆర్డర్‌లో రవీంద్ర జడేజాను ప్రమోట్ చేసినా ఆసీస్ బౌలర్లు అవకాశం ఇవ్వలేదు. వరుస విరామల్లో వికెట్లు తీయడంతో పాటు బౌండరీలు ఇవ్వుకుండా భారత్‌పై ఒత్తిడి పెంచుతున్నారు.

శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ వైఫల్యం టీమిండియాపై అనవసర ఒత్తిడిని తీసుకురాగా.. రోహిత్ శర్మ చెత్త షాట్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించింది. శుభ్‌మన్ గిల్ ఔటైనా.. విరాట్ కోహ్లీతో దూకుడుగా ఆడిన రోహిత్ చెత్త షాట్‌తో పెవిలియన్ చేరాడు.
మ్యాక్స్‌వెల్ వేసిన 10వ ఓవర్‌లో వరుసగా సిక్స్, ఫోర్ బాదిన రోహిత్ మరుసటి బంతిని కూడా భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔటయ్యాడు. ఈ షాట్‌కు ప్రయత్నం చేయకుండా కాస్త ఓపికగా ఆడి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.
బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న ఈ వికెట్‌పై రోహిత్ శర్మ కాస్త ఓపికగా ఆడి ఉంటే తర్వాతి బ్యాటర్లపై ఒత్తిడి ఉండేది కాదు. రోహిత్ ఔటైన వెంటనే అయ్యర్ వెనుదిరగడంతో రాహుల్, కోహ్లీ తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితమయ్యారు.
మరో 16.2 ఓవర్ల వరకు భారత బ్యాటర్లు బౌండరీ బాదలేదంటే పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. సింగిల్స్, డబుల్స్‌తోనే కోహ్లీ హాఫ్ సెంచరీ చేసుకున్నాడు. శుభ్‌మన్ గిల్ ఔటైన తర్వాత రోహిత్ శర్మ తన సెల్ఫ్‌లెస్ గేమ్‌ను పక్కనపెట్టి పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేసుంటే భారత్ మెరుగైన స్కోర్ చేసేందుకు వీలుండేది.
శుభ్‌మన్ గిల్ చెత్ షాట్‌కు వెనుదిరిగినప్పుడు కన్నెర్ర చేసిన రోహిత్.. తాను అదే పేలవ షాట్‌తో పెవిలియన్ చేరాడు. ఇది 'కోడలికి బుధ్ధి చెప్పి అత్త తెడ్డు నాకింది'అన్నట్లు రోహిత్ శర్మ తీరు ఉందని ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.