IND vs ENG: వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో ఆదివారం లక్నో వేదికగా జరిగే మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. వరుసగా ఐదు విజయాలతో టీమిండియా ఊపు మీదుంటే.. ఒకే ఒక్క మ్యాచ్‌లో గెలిచిన ఇంగ్లండ్ పరువు కోసం పాకులాడుతోంది. బంగ్లాదేశ్‌పై మాత్రమే విజయం సాధించిన ఇంగ్లండ్.. అఫ్గాన్, సౌతాఫ్రికా, శ్రీలంక చేతుల్లో ఓడి సెమీస్ రేసు నుంచి తప్పుకుంది.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఓడిస్తే టీమిండియా సెమీస్ బెర్త్ ఖారారు కానుంది. మరోవైపు ఇంగ్లండ్ ఓడితే అధికారికంగా సెమీస్ రేసు నుంచి తప్పుకోనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా అభిమానులను ఓటమి భయం వెంటాడుతోంది. వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో టీమిండియాకు మెరుగైన రికార్డు లేకపోవడమే ఫ్యాన్స్‌ను కంగారుపెడుతోంది.

ఇంగ్లండ్, భారత్ ఇప్పటి వరకు మెగా టోర్నీలో ఏడుసార్లు తలపడగా.. నాలుగుసార్లు ఇంగ్లిష్ జట్టునే విజయం వరించింది. మిగతా మూడుసార్లు టీమిండియా గెలిచింది. 2019 వన్డే ప్రపంచకప్‌లోనూ ఇంగ్లండ్ చేతిలో టీమిండియాకు ఓటమే ఎదురైంది.
ఆ టోర్నీలో కూడా భారత్ ఇప్పటిలాగే వరుసగా ఐదు విజయాలు సాధించింది. ఆరో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడి ఓడింది. ఈసారి కూడా భారత్ ఐదు విజయాలు సాధించి ఆరో మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టుతో మ్యాచ్‌కు సిద్ధం అయింది. దాంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. కానీ 2019లో వరల్డ్ కప్ గెలిచిన ఇంగ్లండ్‌కు ఘోర పరాజయాలతో ఆత్మవిశ్వాసం కోల్పోయి ప్రస్తుత ఇంగ్లండ్ జట్టుకు చాలా తేడా ఉంది.
అంతేకాకుండా సొంతగడ్డపై మెగా టోర్నీ జరుగుతుండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. అయితే వరుస ఓటములతో డీలా పడినా తమదైన రోజున ఇంగ్లండ్ సత్తా చాటుతుంది. కాబట్టి ఆ జట్టును తేలికగా తీసుకోవడానికి లేదు. ఇరు జట్లు ఇప్పటి వరకూ 106 వన్డేల్లో తలపడగా.. భారత్ 57 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, ఇంగ్లండ్ 44సార్లు గెలిచింది. రెండు మ్యాచ్‌లు టై కాగా.. 3 మ్యాచ్‌లు ఫలితం తేలకుండా ముగిసాయి.