World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగుతోంది. అసాధారణ ప్రదర్శనతో వరుసగా 8 మ్యాచ్‌ల్లో గెలుపొంది ప్రత్యర్థులను అష్ట దిగ్భందనం చేసింది. ఈ 8 మ్యాచ్‌లను టీమిండియా ఏకపక్షంగా ముగించడం మరో విశేషం. టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ ముందు ప్రత్యర్థి జట్లన్నీ తేలిపోయాయి.
కనీస పోటీని ఇవ్వలేకపోయాయి. ఇంగ్లండ్‌తో పోరులో టీమిండియా కాస్త తడబడినా.. భారత బౌలర్లు నిప్పులు చెరిగి అసాధారణ విజయాన్ని అందించారు. ప్రస్తుత ప్రపంచకప్‌లో టీమిండియా తరహాలో మరే జట్టు కూడా ఆడటం లేదు. భారీ స్కోర్లతో బెంబేలెత్తించిన సౌతాఫ్రికా.. భారత బౌలింగ్ ముందు చిత్తయ్యింది.

ఏ లెక్కన చూసుకున్నా.. ఈ మెగా టోర్నీలో టీమిండియాకు తిరుగే లేదనిపిస్తోంది. సంచలన ప్రదర్శనతో టేబుల్ టాపర్‌గా నిలిచిన టీమిండియా.. అందరి కన్నా ముందే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్నా..భారత అభిమానులను ఏదో భయం వెంటాడుతోంది. సెమీస్ గండం గట్టెక్కుతుందా? గతంలో మాదిరి నిరాశపరుస్తుందా? అని ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు.
2011 వరల్డ్ కప్ విజయం తర్వాత టీమిండియా రెండు సార్లు సెమీస్‌లోనే వెనుదిరిగింది. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన 2015 ప్రపంచకప్‌లోనూ టీమిండియా వరుస విజయాలతో సెమీస్ చేరింది. రెండు గ్రూప్‌లు జరిగిన ఈ టోర్నీలో గ్రూప్-బీలో ఉన్న భారత జట్టు ఆడిన ఆరు మ్యాచుల్లో.. ఆరింటీ విజయ కేతనం ఎగరేసింది.

మొత్తం 12 పాయింట్లు, పాజిటివ్ నెట్ రన్ రేట్‌తో సెమీస్‌లో అడుగు పెట్టింది. గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచిన ఆసీస్‌తో సెమీఫైనల్ మ్యాచ్ ఆడింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో భారత్ ఓటమి పాలైంది. ఒత్తిడిని అధిగమించలేక ఓటమికి తల వంచింది. 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లోనూ న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైంది.
ఈ రెండు పరాజయాలే కాకుండా 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్, 2016 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్, డబ్ల్యూటీసీ 2021, 2023 ఫైనల్లోనూ ఓటమిపాలైంది. ఈ క్రమంలోనే ఫ్యాన్స్‌కు నాకౌట్ ఫోబియా పట్టుకుంది. దీనికి తోడుగా.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ కూడా ఫ్యాన్స్‌ను మరింత ఆందోళన పరుస్తోంది.

తాజా టోర్నీలో టీమిండియా గెలిచిన 8 మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలో ఒకరు కచ్చితంగా రాణించారు. ఈ ఇద్దరూ విఫలమైతే పరిస్థితి ఏంది? అనేది ఫ్యాన్స్‌ను వెంటాడుతోంది. రోహిత్ ఔటైన సందర్భంలో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.
కోహ్లీ విఫలమైనప్పుడు రోహిత్ చెలరేగాడు. కానీ ఈ ఇద్దరూ విఫలమైన మ్యాచ్ లేదు. సెమీస్ మ్యాచ్‌లో ఈ ఇద్దరూ విఫలమైతే.. టీమిండియాకు కష్టాలు తప్పవని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నాకౌట్ మ్యాచ్‌ల్లో ఈ ఇద్దరికి గొప్ప రికార్డు లేకపోవడం కూడా అభిమానులను వేధిస్తోంది.
| ప్రత్యర్థి | రోహిత్ శర్మ రన్స్ | విరాట్ కోహ్లీ రన్స్ |
| ఆస్ట్రేలియా | 0 | 85 |
| అఫ్గానిస్థాన్ | 131 | 55* |
| పాకిస్థాన్ | 86 | 16 |
| బంగ్లాదేశ్ | 48 | 103* |
| న్యూజిలాండ్ | 46 | 95 |
| ఇంగ్లండ్ | 87 | 0 |
| శ్రీలంక | 4 | 88 |
| సౌతాఫ్రికా | 40 | 101* |