World Cup 2023: న్యూజిలాండ్ శుభారంభం.. ఇంగ్లండ్ తొండాటకు ప్రతీకారం!
అహ్మదాబాద్: వన్డే ప్రపంచకప్ 2023లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్నందుకుంది. ఈ గెలుపుతో 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. బౌండరీల లెక్కతో అడ్డదారిలో గెలిచిన ఇంగ్లండ్‌కు తమ ఆటతో బుద్ది చెప్పింది.
న్యూజిలాండ్ ఆల్‌రౌండ్ షో ముందు ఇంగ్లండ్ బజ్‌బాల్ గేమ్ తేలిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ చేతులెత్తేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 282 పరుగులు చేసింది.

జోరూట్(86 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 77) హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ జోస్ బట్లర్(42 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) పర్వాలేదనిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ మూడు వికెట్లకు తీయగా.. మిచెల్ సాంట్నర్, గ్లేన్ ఫిలిప్స్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ట్రెంట్ బౌల్డ్, రచిన్ రవీంద్రకు తలో వికెట్ దక్కింది.
ఆడుతూ పాడుతూ...
అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ 36.2 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 283 పరుగులు చేసి మరో 82 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. డెవాన్ కాన్వే(121 బంతుల్లో 19 ఫోర్లు, 3 సిక్స్‌లతో 152 నాటౌట్), రచిన్ రవీంద్ర (96 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 123 నాటౌట్) సెంచరీలతో చెలరేగి కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కరణ్ ఒక్కడే ఒక వికెట్ తీసాడు. డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర బ్యాటింగ్‌కు ఇంగ్లండ్ బౌలర్లు తేలిపోయారు.
గోల్డెన్ డక్ అయినా..
283 పరుగుల సాధారణ లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్‌కు ఆరంభలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ విల్ యంగ్(0) గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. సామ్ కరణ్ వేసిన రెండో ఓవర్ తొలి బంతికే కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దాంతో క్రీజులోకి వచ్చిన రచిన్ రవీంద్రతో కలిసి కాన్వే చెలరేగాడు.
ఈ ఇద్దరూ ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురు దాడికి దిగడంతో న్యూజిలాండ్ స్కోర్ బోర్డు పరుగెత్తింది. పవర్ ప్లేలోనే న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది. అనంతరం ఈ జోడీ మరింత ధాటిగా ఆడటంతో 12.1 ఓవర్లలోనే న్యూజిలాండ్ 100 పరుగుల మార్క్‌ను అందుకుంది.
పోటాపడి పరుగులు..
ముందుగా డేవాన్ కాన్వే 36 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా.. ఆ వెంటనే రచిన్ రవీంద్ర కూడా 36 బంతుల్లో నే అర్థశతకం సాధించాడు. హాఫ్ సెంచరీల అనంతరం కూడా ఈ జోడీ అదే జోరును కొనసాగించింది. ఈ జోడీని విడదీసేందుకు జోస్ బట్లర్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. స్పిన్నర్లు కూడా వీరిని అడ్డుకోలేకపోయారు.
సెంచరీలతో కదం తొక్కి..
ఈ ఇద్దరూ పోటాపోటీగా పరుగులు చేస్తుండటంతో ఇంగ్లండ్ బౌలర్లకు ఏడుపు ఒక్కటే తక్కువైంది. 83 బంతుల్లోనే డేవాన్ కాన్వే శతకం సాధించగా.. రచిన్ రవీంద్ర 82 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొయిన్ అలీ బౌలింగ్‌కు సింగిల్ తీసిన రచిన్ రవీంద్ర న్యూజిలాండ్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై ఇంగ్లండ్ బజ్‌బాల్ గేమ్‌తో తొందరపడి వికెట్లు పారేసుకుంది. వారి అత్యుత్సాహమే ఇంగ్లండ్ కొంపముంచింది. మరోవైపు ఆచితూచి ఆడిన న్యూజిలాండ్ సునాయస విజయాన్నందుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications