ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంక: వన్డే ప్రపంచకప్ 2023లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ తడబాటు కొనసాగుతోంది. హాట్ ఫేవరేట్‌గా ఈ టోర్నీ బరిలోకి దిగిన ఇంగ్లండ్.. పేలవ ఆటతీరు.. ఘోర పరాజయాలతో అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా చేతిలో ఓటమి పాలైన ఇంగ్లండ్.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లోనూ తీవ్రంగా తడబడింది.
సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లోనూ చేతులెత్తేసింది. శ్రీలంకతో చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ 156 పరుగులకే కుప్పకూలింది. బెన్ స్టోక్స్(73 బంతుల్లో 6 ఫోర్లతో 43), జానీ బెయిర్ స్టో(31 బంతుల్లో 3 ఫోర్లతో 30) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
శ్రీలంక బౌలర్లలో లాహిరు కుమార(3/35), ఏంజెలో మాథ్యూస్(2/14), కాసున్ రజితా (2/36), మహీశ్ తీక్షణ(1/21) ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ బ్యాటర్లు పిచ్ కండిషన్స్‌ను పసిగట్టలేకపోయారు. స్లో పిచ్‌పై ఓపికగా బ్యాటింగ్ చేయకుండా ధాటిగా ఆడే ప్రయత్నంలో వికెట్లు పారేసుకున్నారు. శ్రీలంక బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. 9వ స్థానం వరకు బ్యాటింగ్ లైనప్ ఉన్నా.. 200 పరుగుల మార్క్ అందుకోలేకపోయారు. బెన్ స్టోక్స్ కాస్త పోరాటం చేయడంతో 150 పరుగుల మార్క్‌ను ఇంగ్లండ్ అందుకోగలిగింది.
ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఇంగ్లండ్‌కు బిగ్ షాక్ తగిలింది. దూకుడుగా ఆడుతున్న ఓపెనర్ డెవిడ్ మలాన్(28) మాథ్యూస్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేరాడు. క్రీజులోకి వచ్చిన జోరూట్(3) అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. దాంతో ఇంగ్లండ్ పవర్ ప్లేలోనే 2 వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది.
నిలకడగా బ్యాటింగ్ చేసిన జానీ బెయిర్ స్టో(30)ను కాసున్ రజితా క్యాచ్ ఔట్ చేయగా.. కెప్టెన్ జోస్ బట్లర్(8)ను లాహిరు కుమారా కీపర్ క్యాచ్‌గా వెనక్కిపంపాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే.. లియామ్ లివింగ్‌స్టోన్(1)ను కూడా కుమారా వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. దాంతో ఇంగ్లండ్ 85 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ పరిస్థితుల్లో బెన్ స్టోక్స్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ మరోవైపు నుంచి అతనికి సహకారం లభించలేదు. మొయిన్ అలీ(15), క్రిస్ వోక్స్(0) వరుసగా పెవిలియన్ చేరారు. హాఫ్ సెంచరీకి చేరువైన స్టోక్స్(43)ను కుమారా పెవిలియన్ చేర్చాడు. డేవిడ్ విల్లే(14 నాటౌట్) కాస్త పోరాటం కనబర్చినా.. ఆదిల్ రషీద్(2), మార్క్‌వుడ్(5) పెవిలియన్ చేరారు.