లక్నో: వన్డే ప్రపంచకప్ 2023లో ఆస్ట్రేలియా పరాజయాల పరంపర కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో టీమిండియా ఇచ్చిన షాక్ నుంచి ఇంకా ఆ జట్టు తేరుకోలేదు. పటిష్టమైన సౌతాఫ్రికాతో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 134 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడా(3/33) తీన్మార్ బౌలింగ్‌కు కుప్పకూలిన ఆసీస్ ఘోర పరాజయం చవిచూసింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 311 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (106 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 109) శతక్కొట్టగా.. ఎయిడెన్ మార్క్‌రమ్(44 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో గ్లేన్ మ్యాక్స్‌వెల్ రెండు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, జోష్ హజెల్ వుడ్, ప్యాట్ కమిన్స్, ఆడమ్ జంపా తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్య చేధనకు దిగిన ఆస్ట్రేలియా సౌతాఫ్రికా పేసర్ల ధాటికి 40.5 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బ్యాటర్లలో మార్నస్ లబుషేన్(74 బంతుల్లో 3 ఫోర్లతో 46) మినహా అంతా విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబడా(3/33) మూడు వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్(2/54), కేశవ్ మహరాజ్(2/30), టబ్రైజ్ షంసీ(2/38) రెండేసి వికెట్లు పడగొట్టారు.
లక్ష్యచేధనలో సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి ఆసీస్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. పవర్ ప్లేలోనే ఓపెనర్లు మిచెల్ మార్ష్(7), డేవిడ్ వార్నర్(13)తో పాటు స్టీవ్ స్మిత్(19) ఔటయ్యారు. దాంతో ఆసీస్ పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయి 50 పరుగులే చేసింది. ఆ తర్వాత కూడా సఫారీ బౌలర్లు అదే జోరు కొనసాగించగా.. ఆసీస్ బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోయారు.
జోష్ ఇంగ్లీస్(5)ను రబడా క్లీన్ బౌల్డ్ చేయగా.. గ్లేన్ మ్యాక్స్‌వెల్(5)ను కేశవ్ మహరాజ్ రిటర్న్ క్యాచ్‌గా ఔట్ చేశాడు. మార్కస్ స్టోయినీస్‌ను కూడా పెవిలియన్ చేర్చిన రబడా.. ఆసీస్‌కు కోలుకోలేని దెబ్బ కొట్టాడు. మిచెల్ స్టార్క్‌తో మార్నస్ లబుషేన్ కాసేపు పోరాడినా.. మార్కోజాన్సెన్ అవకాశం ఇవ్వలేదు.
స్టార్క్(27)ను ఔట్ చేసి ఆసీస్ ఓటమిని ఖాయం చేశాడు. లబుషేన్, ప్యాట్ కమిన్స్(22), జోష్ హజెల్ వుడ్(2) కూడా వెనుదిరగడంతో సఫారీ విజయం లాంఛనమైంది. ఆ జట్టుకు ఇది వరుసగా రెండో విజయం.