IND vs ENG: వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా మరో ఆసక్తికరపోరుకు సిద్దమవుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో లక్నో వేదికగా ఆదివారం జరిగే మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌కు వారం రోజుల విశ్రాంతి లభించడంతో భారత ఆటగాళ్లంతా ధర్మశాల్లోనే ఉండిపోయారు.
అక్కడి హిమాలయాలతో పాటు ప్రకృతి అందాలను ఆస్వాదించాలని డిసైడయ్యారు. వాస్తవానికి దసరా నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లకు 2 రోజులు సెలవులు కూడా ఇచ్చారు. కానీ వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇళ్లకు వెళ్లే బదులు ధర్మశాల్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవడం ఉత్తమమని ఆటగాళ్లు భావించారు.

రెండు రోజుల పాటు ధర్మశాల్లోనే ఉండేందుకు బీసీసీఐ అనుమతించింది. అయితే ట్రెక్కింగ్ చేసేందుకు వీలులేదని ఆటగాళ్లందరికీ సూచించింది. ట్రెక్కింగ్‌తో ఆటగాళ్లు గాయపడే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. ధర్మశాల ప్రకృతి అందాలు చేసేందుకు అనుమతించినా.. ఎలాంటి రిస్కీ పనులు చేయవద్దని తెలిపింది.
'ట్రెక్కింగ్ చేయవద్దని ఆటగాళ్లకు మేనేజ్‌మెంట్ సూచించింది. బయటకు వెళ్లేందుకు అనుమతిచ్చినా.. ట్రెక్కింగ్ చేయడానికి వీలు లేదని స్పష్టం చేసింది. ట్రెక్కింగ్‌తో పాటు ఆటగాళ్లు పారాగ్లైడింగ్ చేసేందుకు వీలు లేదు. ఆటగాళ్ల కాంట్రాక్టులోనే ఈ నిబంధన ఉంది. ఓ సిరీస్ జరుగుతున్నప్పుడు ఏ ప్లేయర్ కూడా పారాగ్లైడింగ్ చేయవద్దు. ఇది బీసీసీఐ ఆటగాళ్ల కాంట్రాక్ట్ నిబంధనల్లోనే ఉంది.'అని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపాడు.
ట్రెక్కింగ్‌కు ధర్మశాల హాట్ స్పాట్. ఈ క్రమంలోనే కొందరు భారత ఆటగాళ్లు ట్రెక్కింగ్ చేసేందుకు ఆసక్తి చూపించారని, కానీ టీమ్‌మేనేజ్‌మెంట్ అంగీకరించలేదని తెలుస్తోంది.

వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమిండియా పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లను మట్టికరిపించిన టీమిండియా.. ఇంగ్లండ్‌ను ఓడించేందుకు సిద్దమవుతోంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకోవాలనే పట్టుదలతో ఉంది.
టీమిండియా బుధవారం ధర్మశాల నుంచి లక్నోకు రానుంది. గురువారం నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టనుంది. గాయంతో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు దూరమైన హార్దిక్ పాండ్యా లక్నోలో జట్టుతో చేరనున్నాడు.