లక్నో: వన్డే ప్రపంచకప్ 2023లో ఆస్ట్రేలియా ఎట్టకేలకు బోణీ చేసింది. రెండు ఘోర పరాజయాల అనంతరం శ్రీలంకపై విజయం సాధించింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆసీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానం నుంచి 8వ స్థానానికి దూసుకెళ్లింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 43.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌట్ అయ్యింది. శ్రీలంక ఓపెనర్లు పాతుమ్ నిస్సంక(67 బంతుల్లో 8 ఫోర్లతో 61), కుశాల్ పెరీరా(82 బంతుల్లో 12 ఫోర్లతో 78) హాఫ్ సెంచరీల రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా(4/47) నాలుగు వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించాడు.

మిచెల్ స్టార్క్(2/43), ప్యాట్ కమిన్స్(2/32) రెండేసి వికెట్లు తీసారు. గ్లేన్ మ్యాక్స్‌వెల్‌కు ఓ వికెట్ దక్కింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆసీస్.. 35.2 ఓవర్లలో 5 వికెట్లకు 215 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. మిచెల్ మార్ష్(67 బంతుల్లో 9 ఫోర్లతో 51), జోష్ ఇంగ్లీస్(59 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 58) హాఫ్ సెంచరీలతో రాణించారు.
మార్నస్ లబుషేన్(60 బంతుల్లో 2 ఫోర్లతో 40), గ్లేన్ మ్యాక్స్‌వెల్(21 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుషంక మూడు వికెట్లు తీయగా.. దునిత్ వెల్లలాగే ఓ వికెట్ పడగొట్టాడు. నాలుగు వికెట్లతో ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆడమ్ జంపాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.