హైదరాబాద్: వన్డే ప్రపంచకప్ 2023లో న్యూజిలాండ్ జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయాన్నందుకుంది. ఫస్ట్ మ్యాచ్‌లో పటిష్ట ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన బ్లాక్ కాప్స్.. రెండో మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. సోమవారం ఉప్పల్ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించి 99 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 322 పరుగులు చేసింది. తొలి మ్యాచ్‌లో శతక్కొట్టిన రచిన్ రవీంద్ర(51 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీతో తన ఫామ్‌ను కొనసాగించగా.. విల్ యంగ్(80 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 70), టామ్ లాథమ్(46 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 53)లు కూడా హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.

డెవాన్ కాన్వే(40 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 32)తో పాటు మిచెల్ సాంట్నర్(17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36 నాటౌట్), డారిల్ మిచెల్(47 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్స్‌లతో 48) పర్వాలేదనిపించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో ఆర్యన్ దత్, పాల్ వాన్, రోయిలోఫో వాన్ డెర్ మార్వె రెండేసి వికెట్లు తీయగా.. బాస్ డీ లీడే ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన నెదర్లాండ్స్ 46.3 ఓవర్లలో 223 పరుగులకు కుప్పకూలింది. మిచెల్ సాంట్నర్(5/59) ఐదు వికెట్లతో నెదర్లాండ్స్ పతనాన్ని శాసించగా... మ్యాట్ హెన్రీ(3/59) మూడు వికెట్లతో సత్తా చాటాడు. రచిన్ రవీంద్రకు(1/46) ఓ వికెట్ దక్కింది.

నెదర్లాండ్స్ బ్యాటర్లలో కొలిన్ అకర్‌మన్(73 బంతుల్లో 5 ఫోర్లతో 69) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్(27 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 30), సైబ్రాండ్ ఎగెల్బెచ్ట్(34 బంతుల్లో 3 ఫోర్లతో 29) పోరాడే ప్రయత్నం చేశారు. తెలుగు తేజం తేజ నిడమనూరు(26 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 21) ఈ మ్యాచ్‌లోనూ తీవ్రంగా నిరాశపరిచాడు. తన కుటుంబ సభ్యుల సమక్షంలో సత్తా చాటలేకపోయాడు. బ్యాటింగ్‌లో 36 పరుగులతో పాటు బౌలింగ్‌లో ఐదు వికెట్లతో సత్తా చాటిన మిచెల్ సాంట్నర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
న్యూజిలాండ్ తమ తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో ఆడనుంది. అక్టోబర్ 13న చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. నెదర్లాండ్స్ తమ తదుపరి మ్యాచ్‌ను అక్టోబర్ 17 ధర్మశాల వేదికగా సౌతాఫ్రికాతో ఆడనుంది.