మహిళల టీ20 ప్రపంచకప్ 2025 టోర్నీలో టీమిండియాకు మరో ఓటమి ఎదురైంది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓడి హ్యాట్రిక్ పరాజయాలను మూటగట్టుకుంది. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మరోసారి ఒత్తిడిని తట్టుకోలేక సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను హర్మన్‌ప్రీత్ సేన చేజార్చుకుంది. కీలక సమయంలో సెటిల్ అయిన బ్యాటర్లు ఔటవ్వడం టీమిండియా కొంపముంచింది. ఒక్క బ్యాటర్ క్రీజులో నిలిచినా ఫలితం మరోలా ఉండేది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 288 పరుగులు చేసింది. హీథర్ నైట్(91 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్‌తో 109) సెంచరీతో చెలరేగగా.. అమీ జోన్స్(68 బంతుల్లో 8 ఫోర్లతో 56) హాఫ్ సెంచరీతో రాణించింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ(4/51) నాలుగు వికెట్లు తీయగా.. తెలుగు తేజం శ్రీ చరణి(2/68) రెండు వికెట్లు పడగొట్టింది.

అనంతరం భారత మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 284 పరుగులు చేసి ఓటమిపాలైంది. స్మృతి మంధాన(94 బంతుల్లో 8 ఫోర్లతో 88), హర్మన్ ప్రీత్ కౌర్(70 బంతుల్లో 10 ఫోర్లతో 70), దీప్తి శర్మ(57 బంతుల్లో 5 ఫోర్లతో 50 ) హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో నాట్ స్కివర్ బ్రంట్(2/47) రెండు వికెట్లు తీయగా.. లారెన్ బెల్, లిన్సీ స్మిత్, చార్లా డీన్, సోఫీ ఎక్లీస్టోన్ తలో వికెట్ తీసారు.
ఎక్స్‌ట్రా బౌలర్‌తో ఆడటంతో పాటు కీలక సమయంలో దీప్తి శర్మ, రిచా ఘోష్ ఔటవ్వడం టీమిండియా కొంపముంచింది. స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కూడా చెత్త షాట్లతో వెనుదిరగడం విజయవకాశాలను దెబ్బతీసింది. సెటిల్ అయిన ఈ ఇద్దరి బ్యాటర్లలో ఒక్కరు చివరి వరకు ఉన్నా టీమిండియా విజయం సాధించేది.
ఈ ఓటమితో సెమీస్ అవకాశాలను టీమిండియా సంక్లిష్టంగా మార్చుకుంది. ఐదు మ్యాచ్‌ల్లో నాలుగేసి విజయాలతో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా పాయింట్స్ టేబుల్‌లో టాప్-2లో నిలిచి ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. తాజా విజయంతో ఇంగ్లండ్ కూడా ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. చివరి స్థానం కోసం భారత్, న్యూజిలాండ్ మధ్య పోటీ నెలకొంది. న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌తో జరిగే తమ తదుపరి రెండు మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. లేదంటే లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది.