Women's T20 World Cup: నాకౌట్ ఫీవర్ తగ్గేదెట్ల.. ఆ టోర్నీతోనైనా మారుతుందా?

హైదరాబాద్: భారత మహిళల టీమ్‌కు నాకౌట్ ఫీవర్ తగ్గడం లేదు. గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లోనూ టీమిండియా ఒత్తిడికి చిత్తయ్యింది. ఈ టోర్నీలో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన భారత్.. అందుకు తగ్గట్లుగానే గ్రూప్ దశలో మెరుగైన ప్రదర్శన చేసింది. తొలి మ్యాచ్‌లో దాయాదీ పాకిస్థాన్ సవాల్‌ను అధిగమించింది.
ఇంగ్లండ్‌తో తప్పా పాకిస్థాన్, వెస్టిండీస్, ఐర్లాండ్‌లపై ఏక పక్ష విజయాలు నమోదు చేసింది. ఇంగ్లండ్‌తో చివరివరకు గట్టి పోటీ ఇచ్చింది. సెమీస్‌లో పటిష్టమైన ఆస్ట్రేలియాను ఓడించినంత పని చేసింది. ఒత్తిడిలో చేసిన తప్పిదాలతో పాటు దురదృష్టం కూడా వెంటాడటంతో ఓటమికి తల వంచింది.
అయితే గెలిచే మ్యాచ్‌లో ఓడటమే ఇప్పుడు అభిమానులు బాధకు గురి చేస్తోంది. దాదాపు చేతుల్లోకి వచ్చిన మ్యాచ్‌ను ఆఖర్లో తడబడే ఒకప్పటి బలహీనతనే పునరావృతం చేసి గొప్ప అవకాశాన్ని చేజార్చుకుంది. ఒకట్రెండు సార్లయితే సరే కానీ.. ప్రతిసారీ ఇదే జరుగుతుండడమే అభిమానులకు చికాకు తెప్పిస్తోంది.

2005 నుంచే..
ప్రపంచకప్‌ల్లో భారత మహిళల నాకౌట్ తడబాటు ఇప్పటిది కాదు. మహిళల క్రికెట్‌కు అంతగా గుర్తింపులేని 2005లోనే మిథాలీ రాజ్ నేతృత్వంలోని భారత జట్టు వన్డే ప్రపంచకప్ ఫైనల్ చేరింది. కానీ అప్పుడు తుది పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. ఆ తర్వాత మళ్లీ 2017లో సంచలన ప్రదర్శనతో భారత్ ఫైనల్‌కు వెళ్లింది.
ఆ టోర్నీలో సెమీఫైనల్లో భీకర ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక విజయం సాధించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ ఆకాశమే హద్దుగా చెలరేగి మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమం అనదగ్గ ఇన్నింగ్స్ (171 నాటౌట్) ఆడింది. కానీ ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లోనూ ఒత్తిడిని అధిగమించలేక గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకుంది.
ఇక 2020లో టీ20 ప్రపంచకప్ గెలిచేందుకు కూడా భారత్‌కు మంచి అవకాశం లభించింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ టోర్నీలో హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని జట్టు చక్కటి ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. కానీ ఫైనల్లో మరోసారి ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. గతేడాది కామన్వెల్త్ గేమ్స్ క్రికెట్ పోటీల్లోనూ భారత్ పసిడి పోరుకు అర్హత పొందింది. మరోసారి ఆసీస్ ప్రత్యర్థిగా తలపడగా.. విజయానికి చేరువగా వచ్చి చేతులెత్తేసింది.

ఒత్తిడి.. భయం.. ఆత్మ విశ్వాస లోపం
నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత అమ్మాయిల తడబాటుకు ఒత్తిడిని తట్టుకోలేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. పెద్ద మ్యాచ్‌లు అనగానే భారత అమ్మాయిలు కంగారు పడిపోతున్నట్లు కనిపిస్తోంది. మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నపుడు ఒత్తిడికి లోనవ్వడం.. ప్రత్యర్థి జట్లను చూసి భయపడిపోవడం, ఆత్మవిశ్వాస లోపం సమస్యలుగా మారుతున్నాయి. పెద్ద మ్యాచ్‌ల్లో భారత అమ్మాయిల ఫీల్డింగ్ లోపాలు కూడా తలనొప్పిగా మారుతున్నాయి.

పురుషుల జట్టు కూడా..
90వ దశకం వరకు భారత పురుషుల జట్టు కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. కానీ సౌరవ్ గంగూలీ సారథ్య బాధ్యతలు అందుకున్నాక కథ మారింది. ప్రత్యర్థి ఎవరని చూడకుండా..విజయం కోసం పోరాడటం జట్టుకు అలవాటైంది. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో జట్టు మరింత రాటుదేలింది. ఐపీఎల్ రాకతో యువ ఆటగాళ్లలో బెరుకు పూర్తిగా దూరమైంది. ఒత్తిడిని అధిగమించే అలవాటుతో పాటు ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం పెరిగింది. ఫీల్డింగ్ ప్రమాణాలు కూడా ఎంతో మెరుగయ్యాయి.

డబ్ల్యూపీఎల్‌తో మారెనా..?
ఇప్పుడు మహిళల జట్టులోనూ పురుషుల జట్టు మాదిరి మార్పు కావాలి. ఇందుకు ఈ ఏడాది నుంచి ప్రారంభం కానున్న మహిళల ప్రిమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) ఉపకరిస్తుందనే అంచనాలున్నాయి. ఆ టోర్నీలో ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్లతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకునే అవకాశం మన అమ్మాయిలకు లభించనుంది. వారి సహచర్యం కచ్చితంగా ఉపకరించనుంది. ఉత్తమ శిక్షణ లభించనుంది.
లీగ్ వల్ల ఏడాదిలో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన అనుభవమూ ఆటగాళ్లకు లభించనుంది. ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లు తరచుగా ఆడడం వల్ల వాటికి అలవాటు పడి అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో మరింత మెరుగైన ప్రదర్శన చేయడానికి అవకాశం లభించనుంది. ఈ లీగ్‌తోనైనా భారత అమ్మాయిల రాత మారుతోంది చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications