
కేప్‌టౌన్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో సంచలన ఫలితం నమోదైంది. ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న సౌతాఫ్రికా జట్టుకు శ్రీలంక గట్టి షాకిచ్చింది. శుక్రవారం జరిగిన ఆరంభ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన శ్రీలంక జట్టు 3 పరుగుల తేడాతో తమ కంటే మెరుగైన సౌతాఫ్రికాను ఓడించింది.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 129 పరుగులు చేసింది.
ఆ జట్టు ఓపెనర్, కెప్టెన్ చమారి ఆటపట్టు(50 బంతుల్లో 12 ఫోర్లతో 68) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. విష్మీ గుణరత్నే(35) పర్వాలేదనిపించింది. సఫారీ బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్, మరిజన్నే కాప్, నదిన్ డి క్లెర్క్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆతిథ్య సౌతాఫ్రికా.. శ్రీలంక స్పిన్ ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 126 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. లంక బౌలర్లు చెలరేగడంతో సౌతాఫ్రికా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. దాంతో చివరి ఓవర్లో ఆ జట్టు విజయానికి 12 పరుగులు అవసరమవ్వగా.. సఫారీ బ్యాటర్లు 9 పరుగులు మాత్రమే చేసి ఓటమికి తలవంచారు.

కెప్టెన్ సునే లూస్(28), ఓపెనర్ లౌరా వోల్వార్డట్(18) టాప్ స్కోరర్లుగా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో సుగందిక కుమారి(2/28), ఒశాడి రణసింఘే(2/20) రెండేసి వికెట్లు తీయగా.. ఇనోక రణవీర(3/18) మూడు వికెట్లు పడగొట్టింది.

ఈ టోర్నీకి ముందు భారత్, వెస్టిండీస్‌తో జరిగిన ట్రై సిరీస్‌ను సౌతాఫ్రికా గెలుచుకుంది. కానీ ఆ జోరును మెగా టోర్నీలో కొనసాగించలేకపోయింది. ముఖ్యంగా భారత్‌తో జరిగిన ఫైనల్లో క్విక్ ఫైర్ ఇన్నింగ్స్ ఆడిన చోటో ట్రైయాన్(10) ప్రపంచకప్‌లో దారుణంగా విఫలమైంది. ఈ టోర్నీలో నేడు వెస్టిండీస్ -ఇంగ్లండ్, ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌తో భారత మహిళలు ఈ టోర్నీని ప్రారంభించనున్నారు.

స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఈ మ్యాచ్‌కు అనుమానంగా మారింది. సోమవారం ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తుండగా.. స్మృతి ఎడమ చేతి మధ్య వేలికి గాయమైంది. దీంతో బంగ్లాదేశ్‌తో తర్వాతి వార్మప్ మ్యాచ్‌కు ఆమె దూరమైంది. గాయం నుంచి స్మృతి ఇంకా కోలుకోకపోవడంతో ఆదివారం పాక్‌తో పోరులో ఆడడం అనుమానంగా మారింది. స్మృతి లేకపోతే భారత బ్యాటింగ్ ఆర్డర్ బలహీనపడుతుందనడంలో సందేహం లేదు.